ఏపీ సీఎం చంద్రబాబు జపిస్తున్న పీ-4 మంత్రం గురించి తెలుసుకదా! పేదలను ధనికులుగా చేయాలన్నది ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్ షిప్‌గా పేర్కొనే ‘పీ-4’ ద్వారా వచ్చే నాలుగేళ్లలో రాష్ట్రంలోని 20 లక్షల మంది పేదలను ధనికులుగా చేయాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. గత నెలలో విస్తృతంగా ఈ కార్యక్రమానికి ప్రచారం కూడా కల్పించారు.
సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబాలు.. పేదల కుటుంబాలకు సాయం చేయడం ద్వారా రా ష్ట్రంలో పేదరికాన్ని తగ్గించవచ్చన్నది చంద్రబాబు సంకల్పం. సాయం పొందే కుటుంబాలను ‘బంగారు కుటుంబాలు’గా, సాయం చేసేవారిని ‘మార్గదర్శకులు’గా చంద్రబాబు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
పీ-4 కోసం పనిచేయడమే ఈ ఉద్యోగుల ప్రధాన లక్ష్యం. ఈ నెల 1వ తారీకు నాటికి 40 ఏళ్ల వయసు మించని యువతీయువకులు.. ఈ ఉద్యోగాల్లో చేరొచ్చు. అయితే.. ఏడాదిపాటు మాత్రమే కాంట్రాక్టు ఉంటుంది. ఆ తర్వాత కూడా.. ప్రభుత్వానికి అవసరం ఉందని భావిస్తే.. పనితీరు ఆధారంగా కాంట్రాక్టును పొడిగిస్తారు. ఇక, నెలనెలా రూ.60000 వేతనంగా చెల్లిస్తారు. టీఏ, డీఏలు అదనంగా ఉంటాయి.
ఏం చేయాలి?
పీ-4 ఉద్యోగులు.. బంగారు కుటుంబాలను గుర్తించడం.. నిరంతరం వారిని మానిటరింగ్ చేయడం వంటివి చేయాలి. అదేవిధంగా మార్గదర్శకులను కూడా గుర్తించాలి. వారిని ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగేలా ఒప్పించాలి. ఇదొక రకంగా.. రిప్రెజెంటేషన్ తరహా ఉద్యోగాలు. ఇవి మానసిక ఆనందంతోపాటు.. పేదరిక నిర్మూలనలోనూ.. ఉద్యోగుల పాత్రను ప్రధానంగా మెరిసేలా చేస్తాయని ప్రభుత్వం తెలిపింది. మరి ఇంకెందుకు ఆలస్యం.. 175 పోస్టులు ఉన్నాయి. ఎంబీఏ, పీజీ చేసి, 40 ఏళ్లు మించని వారు.. దరఖాస్తు చేసుకోవడానికి రెడీ అవ్వండి!.
Gulte Telugu Telugu Political and Movie News Updates