ఏంచేసినా తనకంటూ స్పెషల్‌గా ఉండే.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. తాజాగా ఏపీ రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభ ఘట్టానికి కూడా తనదైన శైలిలో స్పందించారు. ఒక్క ఆయన నియోజకవర్గం నుంచే 100 బస్సులను అమరావతికి తరలించారు. అదేవిధంగా యువత ముందుకు రావడంతో దాదాపు వెయ్యికి పైగా బైకులను కూడా..అమరావతికి పంపించారు.
బస్సుల్లో ఒక్కొక్క బస్సుకు 30 మంది చొప్పున 3 వేల మంది, బైకులపై ఇద్దరేసి చొప్పున 2వేల మంది మొత్తంగా 5 వేల మందికిపైగా ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి అమరావతికి తరలించారు. ఉరికే ఉత్సాహంతో దెందులూరు నియోజకవర్గం నుంచి వేలాదిగా అమరావతికి తరలి వెళ్లిన కూటమి శ్రేణులు, ప్రజలు కూడా తరలి వెళ్లారు. ఆయా బస్సులు, బైకులకు ఎమ్మెల్యే చింతమనేని.. హనుమాన్ జంక్షన్ వద్ద నుంచి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అంతేకాదు.. పంపించడంతోనే ఆయన చేతులు దులుపుకోకుండా.. దెందులూరు నియోజకవర్గం నుంచి అమరావతిలో జరిగే రాజధాని పనుల ప్రారంభ కార్యక్రమానికి వెళ్తున్న నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రజల కోసం గన్నవరం వద్ద గల ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. వేలాదిగా వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేశారు.
రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప పండుగ వాతావరణం లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ మహోన్నత కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే చింతమనేని వ్యాఖ్యానించారు. కాగా.. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని దెందులూరు, పెదవేగి, పెదపాడు, ఏలూరు రూరల్ మండలాల నుంచి ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates