10 మాసాలు.. అమ‌రావ‌తి వేదిక‌గా చంద్ర‌బాబు 10 రికార్డులు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి 10 మాసాలు అయిపోయాయి. తాజాగా రాజ‌ధాని అమ‌రావతికి ప‌నులను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఈ ప‌ది మాసాల్లో సాధించిన ప్ర‌గ‌తిని, రికార్డుల‌ను ఈ వేదిక‌గా భారీ స్క్రీన్ల‌పై ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్త‌య్యాయి. మొత్తం 20 కి పైగా భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటిని స‌భ‌కు వ‌చ్చే వారు ఎక్క‌డ నుంచైనా చూసేలా ఏర్పాటు చేశారు.

ఇక‌, రికార్డుల విష‌యానికి వ‌స్తే.. ప్ర‌ధానంగా అభివృద్ది-సంక్షేమం-సంస్క‌ర‌ణ‌లు.. అనే మూడు కోణాల్లో సాధించిన అంశాల‌ను ఈ వేదిక ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌నున్నారు. వీటిలో 1) సూప‌ర్ సిక్స్ హామీల అమ‌లు. మొత్తం ఆరు హామీల్లో ఇప్ప‌టికి అమ‌లు చేస్తున్న పింఛ‌న్ల పెంపును.. త‌ద్వారా పొందుతున్న ల‌బ్ధిని ప్ర‌జ‌ల అభిప్రాయాల‌తో స‌హా వివ‌రిస్తారు. 2) ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల‌ను ప్ర‌స్తావిస్తారు. వీటి ద్వారా మేలు జ‌రుగుతున్న కుటుంబాల‌ను ప‌రిచ‌యం చేస్తారు.

3) ఉచిత ఇసుక‌, 4) వాట్సాప్ పాల‌న‌. ఈ రెండు కూడా.. ప్ర‌జ‌ల‌కు బాగా చేరువ‌య్యాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. దీంతో వాటితాలూకు వివ‌రాల‌ను.. పొందుతున్న ల‌బ్ధిని వివ‌రించ‌నున్నారు. 5) డీఎస్సీ. చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణం చేసిన త‌ర్వాత‌.. అధికారికంగా చేసిన తొలి సంత‌కం దీనిపైనే. ఇప్ప‌టికి నోటిఫికేష‌న్ కూడా ఇచ్చారు. దీనిని కూడా ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. 6) రాష్ట్రానికి రానున్న పెట్టుబ‌డులు. పెద్ద పెద్ద సంస్థ‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి. వాటి వివ‌రాల‌ను.. రాబోయే ఉద్యోగాల‌ను వివ‌రించ‌నున్నారు.

7) ఎంఎస్ ఎంఈ పార్కులు. వీటి ద్వారా సుమారు ఇప్ప‌టికే ల‌క్ష‌మందికి ఉపాధి చూపించిన‌ట్టు ప్ర‌భుత్వం చెబుతోంది. వాటి వివ‌రాల‌ను కూడా వెల్ల‌డించ‌నున్నారు. 8) రాజ‌ధాని ప్ర‌గ‌తి. అమ‌రావ‌తి నిర్మాణాలు. ఈ రెండు కీల‌కంగా మారాయి. రాష్ట్రాన్ని దేశ‌స్థాయి నుంచి ప్ర‌పంచ స్థాయికి తీసుకువెళ్లాయి. వీటిని కూడా స‌మ‌గ్రంగా వివ‌రిస్తారు. 9) పాల‌న ప‌రంగా సంస్క‌ర‌ణలు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్న తీరు. ప్ర‌జా ప్ర‌తినిధుల ప‌నితీరును కూడా వివ‌రిస్తారు. 10) స‌మ‌గ్ర అంచ‌నాలు.. విజ‌న్ 2047. భ‌విష్య‌త్తులో రాష్ట్రం సాధించే ప్ర‌గ‌తిని ఈ సంద‌ర్భంగా క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించ‌నున్నారు.