‘ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఛాన్స్ ఇవ్వట్లేదు కానీ.. ఇస్తేనా?’ ఇదీ.. సీఎంవోలో వినిపిస్తున్న మాట. దీనికి కారణం.. కొందరు సలహాదారులు సచివాలయంలోనే తిష్ట వేస్తున్నారు. ఔనన్నా కాదన్నా.. గత వైసీపీ ప్రభుత్వం అంత కాకపోయినా.. ప్రస్తుత కూటమి సర్కారు కూడా.. సలహాదారులకు పెద్ద పీటే వేసింది. లెక్కకు మిక్కిలి కాకున్నా.. కొందరిని నియమించింది. ఇప్పటి వరకు ఉన్న లెక్క ప్రకారం.. 60-70 మంది వరకు సలహాదారులు ఉన్నారు.
అయితే.. ఎవరి పేరూ బయటకు రాదు..ఎవరూ బయటకు కనిపించరు. దీంతో సలహాదారుల గురించిన చర్చ పెద్దగా రావట్లేదు. అయితే.. వీరిలో చాలా మంది తమ తమ వ్యవహారాల్లో ఉంటే.. మరికొందరు మాత్రం సచివాలయంలో తిష్ట వేస్తున్నారు. మీడియా మిత్రులతో కలిసి తేనీరు సేవించి.. పిచ్చాపాటీ కబుర్లు కూడా చెబుతున్నారు. మరి వీరికి పనిలేదా? అంటే.. ఉందని వారే చెబుతున్నారు. కానీ.. తాము ఏం చెప్పినా.. పక్కన పెడుతున్నారన్నది వారి వాదన.
పర్యాటకం నుంచి పరిశ్రమల వరకు పలువురు సలహాదారులు ఉన్నారు. కానీ, పర్యాటక శాఖలో సలహా ఇస్తే.. మంత్రి కందుల దుర్గేష్.. సదరు సలహా కన్నా.. మరింత మెరుగ్గా ఆలోచన చేస్తున్నారు. దీంతో సలహా బుట్టదాఖలు అవుతోంది. పరిశ్రమల విషయంలోనూ ఇదే విధానం ఉంది. సో.. మొత్తంగా సలహాదారుల్లో చాలా మంది ఖాళీగానే ఉంటున్నారు. కానీ, వారు చెబుతున్న మాట… సీఎం చంద్రబాబు ఛాన్స్ ఇస్తే.. అని వ్యాఖ్యానిస్తున్నారు.
గతంలో వైసీపీ అధినేత జగన్ ఇలానే సలహాదారులను ముందు పెట్టి రాజకీయాలు చేశారు. ప్రభుత్వాన్ని కూడా నడిపించారు. అయితే.. అది బెడిసి కొట్టింది. పైగా.. ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగా.. సర్కారు అభాసుపాలైంది. సకల శాఖ మంత్రి అంటూ.. ఆయనపైనా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యాన్ని నిశితంగా గమనించిన చంద్రబాబు.. సలహాదారులకు ఛాన్స్ ఇవ్వడం లేదన్న చర్చ అయితే ఉంది. మరి వీరి సేవలను ఎలా వాడుకుంటారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates