15 రోజులే గ‌డువు,వారిపై రౌడీ షీట్లు ఓపెన్ చేయండి: చంద్ర‌బాబు

ఒక‌సారి చెప్పి చూశారు. రెండు సార్లు వార్నింగ్ ఇచ్చారు. మూడో సారి కేసులు పెట్ట‌మ‌ని ఆదేశించారు. అయినా.. వారు దారికి రాలేదు. పైగా మ‌రింతగా రెచ్చిపోతున్నారు. ఇక‌, ఏం చేస్తారు? ఈ క్ర‌మంలోనే సీఎం చంద్ర‌బాబు సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న రేష‌న్ డీల‌ర్లు, మిల్ల‌ర్లు, రేష‌న్ సంబంధిత ఉద్యోగుల‌పై రౌడీ షీట్లు ఓపెన్ చేయాల‌ని సంచ‌ల‌న ఆదేశాలు జారీ చేశారు. తాజాగా వివిధ జిల్లాల్లో జ‌రుగుతున్న రేష‌న్ పంపిణీ స‌హా.. రేష‌న్ అక్ర‌మాల‌పై..చంద్ర‌బాబు స‌మీక్షించారు.

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత‌.. రేష‌న్ అక్ర‌మాల‌పై ఉక్కుపాదం మోపుతున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన నాయ‌కుడు, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ అయితే.. ఎప్ప‌టిక‌ప్పుడు రేష‌న్ అక్ర‌మాల‌ను నిలువ‌రించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఎక్క‌డి కక్క‌డ అక్ర‌మాల‌ను నిలువ‌రించే ప్ర‌య‌త్నం కూడా చేస్తున్నారు. అయినా.. అక్ర‌మాలు మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌జ‌ల నుంచి కూడా భారీ సంఖ్య‌లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మ‌రోవైపు..రేష‌న్ బియ్యాన్ని త‌ర‌లిస్తున్న చ‌ర్య‌లు కూడా ఆగ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా రేష‌న్ బియ్యం అక్రమార్కుల పై రౌడీ షీట్ ఓపెన్ చేయండి అని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు.. ఇక నుంచి అక్రమ రేషన్ బియ్యం ఆగ‌డాల‌కు ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిస్తే వారిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. త‌ర‌లింపు ప్రక్రియ‌లో ఎలాంటి వారు ఉన్నా.. ఉపేక్షించ‌వ‌ద్ద‌ని ఆయ‌న ఆదేశించారు. ఒక‌వేళ రైస్ మిల్ల‌ర్లే ఉంటే.. వారిపై కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేయ‌డంతోపాటు.. వారి మిల్లు లైసెన్సునుకూడా ర‌ద్దు చేయాల‌ని ఆదేశించారు. ఈ విష‌యంలో పోలీసులు, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ అధికారులు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల‌ని తెలిపారు.

రేష‌న్ బియ్యం అక్ర‌మాల‌పై వ‌చ్చిన ప్ర‌తి ఫిర్యాదును ప‌టిష్టంగా ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. 15 రోజుల్లో వ్య‌వ‌స్థ మొత్తం మారాల‌ని చంద్ర‌బాబు తెలిపారు. మ‌రోసారి 15 రోజుల త‌ర్వాత‌.. తాను స‌మీక్షిస్తాన‌ని.. అప్ప‌టికి ఇలాంటి ఫిర్యాదులు రావ‌డానికి వీల్లేద‌న్నారు. ఈ అక్ర‌మాల్లో ఏ పార్టీవారు ఉన్నా.. వ‌దిలి పెట్ట‌వ‌ద్ద‌ని .. ఎవ‌రి సిఫార‌సుల‌ను కూడా ప‌రిగ‌ణ‌నలోకి తీసుకోవ‌ద్ద‌ని సూచించారు. కాగా.. రేష‌న్ బియ్యం అక్ర‌మాల్లో అధికార పార్టీకి చెందిన నాయ‌కులు ఎక్కువ‌గా ఉన్నారంటూ.. మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్న నేప‌థ్యంలో చంద్ర‌బాబు నేరుగా ఆదేశాలు ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.