పాకిస్థాన్ ప‌న్నాగం.. స‌రిహ‌ద్దుల్లో షాకింగ్ ప‌రిణామాలు!

జ‌మ్ము క‌శ్మీర్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతం ప‌హ‌ల్గాంలో ఉగ్ర‌వాద దాడి జ‌రుగుతుంద‌ని పాకిస్థాన్‌కు ముందే తెలుసా? ఈ దాడి ప‌రిణామాల నేప‌థ్యంలో భార‌త‌దేశం త‌మ‌పై యుద్ధానికి దిగుతుంద‌ని ముందుగానే అంచ‌నా వేసుకున్నారా? ఎలాంటి ప‌రిణామాల‌నైనా ఎదుర్కొని.. భార‌త్‌ను ఇరుకున పెట్టాల‌ని నిర్ణ‌యించుకున్నారా? అంటే.. తాజాగా భార‌త్-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు ప్రాంతాల వెంబ‌డి ఉన్న ప‌రిస్థితిని అంచ‌నా వేసిన అమెరికా.. ఔన‌నే చెబుతోంది. పాకిస్థాన్ ముందుగానే అన్నీ సిద్ధం చేసుకుంద‌ని కూడా వివ‌రించింది.

భార‌త్ కాలుదువ్వుతుంద‌ని.. ఆ స‌మ‌యంలో స‌రైన విధంగా స్పందించి.. భార‌త్‌పై యుద్ధం చేయాల‌ని పాకిస్థాన్ ముందుగానే ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న‌ట్టు అమెరికా ఒక అంచ‌నాకు వ‌చ్చింది. అమెరికాలోని పెంట‌గాన్‌(సైనిక స్థావ‌రం) అధికారులు వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. పాకిస్థాన్ చాలా ముందుగానే భార‌త్‌పై యుద్ధానికి స‌న్న‌ద్ధ‌మైన‌ట్టు తెలుస్తోంది. భార‌త్-పాక్ నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి అత్యంత ఎత్త‌యిన ప్రాంతాల‌లో ప్ర‌స్తుతం పాకిస్థాన్ సైన్యం మోహ‌రించి ఉంది. వాస్త‌వానికి ఎప్పుడూ ఇలా ఉండ‌ద‌ని.. ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ఉంటార‌ని పేర్కొంది. ఇప్పుడు భారీ ఎత్తున పాక్ ద‌ళాలు ఉండ‌డం ప‌క్కా ప్లాన్‌లో భాగ‌మేన‌ని అమెరికా తెలిపింది.

భార‌త్ గ‌తంలో చేసిన‌ట్టు స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేసే అవ‌కాశం కూడా ఉంద‌ని పాకిస్థాన్ ముందుగానే లెక్క‌లు వేసుకుంది. ఈ క్ర‌మంలో పాక్ కూడా అప్రమత్తంగా ఉంది. రియల్‌టైమ్‌ ఇంటెలిజెన్స్‌, శక్తిమంతమైన దళాలు, కచ్చితమైన ప్లానింగ్ ను ముందుగానే గుర్తించే వ్య‌వ‌స్థ‌ను రంగంలోకి దింపిన‌ట్టు పెంట‌గాన్ గుర్తించింది. సో.. భార‌త్ కాలు దువ్వి స‌ర్జిక‌ల్ స్ట్ర‌యిక్స్ చేసినా.. పాకిస్థాన్ దీటుగా ఎదిరించేందుకు సిద్ధంగా ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. అంతేకాదు.. భారీ శతఘ్నులు, స్నైపర్‌ గన్స్‌తో భార‌త్ త‌మ స్థావ‌రాల‌పై కాల్పులు జ‌రిపే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన పాకిస్థాన్‌.. రాత్రికి రాత్రి స్థావ‌రాలు ఖాళీ చేసింద‌ని పెంట‌గాన్ వివ‌రించింది.

మొత్తంగా చూస్తే.. పాకిస్థాన్ చాలా వ్యూహాత్మ‌కంగానే వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. భార‌త్ ఉగ్ర‌దాడి నుంచి తేరుకుని.. త‌మ‌పై యుద్ధానికి కాలుదువ్వే ప‌రిస్థితి వ‌చ్చేలోపే.. పాకిస్థాన్ ఇలా అన్నీ రెడీ చేసుకోవ‌డం చూస్తే.. ఇది చాలా వ్యూహాత్మ‌కంగా జ‌రుగుతున్న వ్య‌వ‌హార‌మేన‌ని భార‌త దేశ నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు భార‌త్ అనుస‌రించే వ్యూహం కీల‌కంగా మారింది. మ‌రోవైపు.. 24 గంట‌ల్లోనే పాకిస్థాన్‌పై విరుచుకుప‌డే అవ‌కాశం ఉంద‌ని భార‌త ఆర్మీలో ప‌నిచేసిన మాజీ అధికారులు చెబుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.