తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే..ఈ వసూళ్లు ఇప్పటికిప్పుడు జరిగినవి కాదని.. ఎప్పటి నుంచో జరుగుతున్నవేనని తెలిసింది. మంత్రి పొంగులేటి వ్యక్తిగత కార్యదర్శులమని చెబుతూ.. వ్యాపారులు, వాణిజ్య వేత్తలను కలుసుకుని.. వారి నుంచి భారీ మొత్తంలోనే సొమ్మును రాబట్టినట్టు పోలీసులు తెలిపారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మంత్రి పొంగులేటి.. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన నాయకుడు. కానీ, ఆయన పేరు చెప్పి దందాలు జరుగుతోంది మాత్రం వరంగల్‌లో!.
ఈ వ్యవహారంలో ఆది నుంచి మోసపోతున్న వ్యాపారులు.. తాజాగా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మంత్రి పీఏల మంటూ.. చెప్పుకొని వసూళ్లకు పాల్పడుతున్న బుస్సా వెంకటరెడ్డి, మచ్చా సురేష్‌లను రెడ్ హ్యాండెడ్‌గా వరంగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు.. వారి బ్యాంకు వివరాలు.. పాసుపుస్తకాలు.. మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో చిత్రమైన విషయం.. వారి వద్ద ఐడీ కార్డులు కూడా ఉండడం. దీనిపై పొంగులేటి చేసిన సంతకాలను కూడా ఫోర్జరీ చేసి.. వినియోగించారని పోలీసులు గుర్తించారు.
‘మోస పోకండి’
కాగా.. తన పేరు చెప్పి.. దోచుకుంటున్న పీఏల వ్యవహారంపై మంత్రి పొంగులేటి తీవ్రంగా స్పందించారు. తన పీఏలు తనవద్దే ఉంటారని.. ఎవరి వద్దా.. లంచాలు తీసుకోరని చెప్పారు. ఎవరైనా తన పేరు చెప్పి వసూళ్లకు పాల్పడితే.. పోలీసులు కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. అంతేకాదు.. తన పీఏలంటూ.. ఎవరైనా వస్తే.. ముందుగా తనకు ఫోన్ చేసి.. చెప్పాలని.. ఆ తర్వాతే వారితో సంభాషించాలని.. సొమ్ములు ఎవరూ ఇవ్వొద్దని మంత్రి తెలిపారు. ఈ క్రమంలో తన కార్యాలయానికి చెందిన రెండు ఫోన్ నెంబర్లను మంత్రి ప్రజలకు ఇచ్చారు.