జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఓ మాట చెప్పారంటే… దానికి అనుగుణంగానే ముందుకు సాగుతూ ఉంటారు. ఈ విషయం ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితం కాగా.. తాజాగా శుక్రవారం నాటి తన పిఠాపురం పర్యటనలోనూ ఇదే విషయాన్ని ఆయన మరోమారు నిరూపించారు. అక్రమ, అసాంఘీక కార్యక్రమాలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని చెప్పిన పవన్… వాటికి పాల్పడ్డ వారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. అంతేకాకుండా అలాంటి వారి విషయంలో పార్టీలను చూడబోమని కూడా తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలకు ఏ పార్టీ వారు పాల్పడినా కూడా పార్టీలను చూడకుండా శిక్షలు అమలు చేస్తామని పవన్ విస్పష్టంగా ప్రకటించారు.
ఇటీవలే పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని మల్లాం పంచాయతీ పరిధిలో ఎస్సీ వర్గానికి చెందిన సురేశ్ బాబు అనే వ్యక్తి విద్యుత్ మరమ్మతుల పనిచేస్తూ ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఘటనకు కులం రంగు పూసిన కొందరు గ్రామంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారంటూ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన వెంటనే పవన్ వేగంగా స్పందించారు. తాను అందుబాటులో లేకున్నా… జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడిన ఆయన సమస్యను పరిశీలించి దానిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని, ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకోవాలని సూచించారు. పవన్ సూచనతో రంగంలోకి దిగిన కలెక్టర్, ఇతర అధికారులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇదే విషయాన్ని జనసేన కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి, పిఠాపురం జనసేన ఇంచార్జీ మర్రెడ్డి శ్రీనివాసరావు, మాల కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు, పలువురు ఎస్సీ నేతలు ఆ ఘటన జరిగిన మరునాడు వాస్తవ పరిస్థితులను జనానికి తెలియజేశారు. తాజాగా శుక్రవారం పిఠాపురం పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్… 100 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన సమయంలో మీడియా ప్రతినిధులు పిఠాపురం లా అండ్ ఆర్డర్ విషయాన్ని ప్రస్తావించగా దానిపై విస్పష్టంగా స్పందించారు. ఎలాంటి అసాంఘీక కార్యక్రమాలు జరిగినా పార్టీలకు అతీతంగా చాలా కఠినంగా యాక్షన్ తీసుకుంటామని ఆయన తేల్చి చెప్పారు. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉంటే కూడా ఉన్నతాధికారులకు తెలియజేస్తే.. వాటిని తాము పరిష్కరిస్తామని కూడా పవన్ చెప్పుకొచ్చారు. వెరసి మల్లాంలో రేకెత్తిన సమస్యను పవన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండానే ఇట్టే పరిష్కరించారు. ఈ తరహా వేగవంతమైన చర్యలపై పిఠాపురం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates