5వ త‌ర‌గ‌తి నుంచే ఏఐ పాఠాలు: చంద్ర‌బాబు

రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో 5వ త‌ర‌గ‌తి నుంచే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ను ప్ర‌వేశ పెట్టాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్నట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఈ రోజు(గురువారం) ఏఐపై నిర్వ‌హించిన వ‌ర్క్‌షాపులో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఏఐ ఆధారిత వ‌స్తువుల ఉత్ప‌త్తుల‌ను..ఏయే రంగాల‌ను ప్ర‌భావితం చేయ‌నుంద‌నే వివ‌రాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో వ‌చ్చే మార్పుల‌ను చంద్ర‌బాబుకు ప‌లువురు ఐటీ నిపుణులు వెల్ల‌డించారు. 

అయితే.. ఎంత మార్పు వ‌చ్చినా.. దానికి త‌గిన విధంగా నైపుణ్య‌శిక్షణ ఇచ్చేలా చూడాల‌ని .. ఉద్యోగాల స‌మ‌స్య త‌లెత్త‌కుండా వ్య‌వ‌హ‌రించాలని చంద్ర‌బాబు వారికి సూచించారు. ఏఐతో పంట‌ల‌ను కాపాడుకునే ప్ర‌క్రియ‌కు ఉత్త‌రాది రాష్ట్రాలు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఆయ‌న వివ‌రించారు. డ్రోన్ల‌ను వినియోగించి..ఏఐ సాంకేతిక‌త‌తో పంట‌ల‌కు పురుగు మందుల పిచికారీతోపాటు.. తెగుళ్ల‌ను కూడా గుర్తించే అవ‌కాశం ఉంద‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు తెలిపారు. 

రాష్ట్రంలోనూ స్వ‌యం స‌హాయ‌క సంఘాల్లోని మ‌హిళ‌ల‌కు ఏఐ ఆధారిత వ‌స్తువుల వినియోగంపై శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. ముఖ్యంగా వ్వ‌య‌సాయ ప‌నుల్లో పాల్గొనే మ‌హిళ‌ల‌కు.. ఏఐ ద్వారా డ్రోన్ల‌ను వినియోగించే శిక్ష‌ణ ఇవ్వ‌డం ద్వారా.. మెరుగైన ఉత్ప‌త్తులు సాధించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని తెలిపారు. అదేవిధంగా ఇప్ప‌టికే ఐటీ రంగంలో ఉన్న‌వారికి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించేందుకు ఏఐలో మ‌రింత శిక్ష‌ణ ఇచ్చేలా చూడాల‌ని సూచించారు. 

రాష్ట్రంలో ఏఐ యూనివ‌ర్సిటీని ఏర్పాటు చేసేందుకుత‌మ ప్ర‌భుత్వం కృత నిశ్చ‌యంతో ఉంద‌ని చంద్ర‌బాబు తెలిపారు. అదేవిధంగా ఏఐపై 5వ త‌ర‌గ‌తి నుంచే అవ‌గాహ‌న క‌ల్పించ‌డం ద్వారా.. భ‌విష్యత్తులో ఎలాంటి స‌వాళ్ల‌నైనా ఎదుర్కొనేలా రాష్ట్రంలోని విద్యార్థుల‌ను తీర్చిదిద్దాల‌ని సూచించారు. దీనికి స్టార్ట‌ప్ రంగాన్ని ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంద‌ని తెలిపారు. ఈ దిశ‌గా మంచి స్టార్ట‌ప్ ల‌ను కూడా.. ఎంపిక చేసి.. వాటికి రుణాలు ఇప్పించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.