సోషల్ మీడియా కనిపించే పోస్టుల్లో.. వైరల్ అయ్యే ఫొటోలు, వీడియోల్లో ఏది ఒరిజినలో ఏది ఫేకో అర్థం కాని పరిస్థితి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు విషయం రూఢి చేసుకోకుండా పోస్టులు పెట్టేస్తుంటారు. ఏదైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇక అంతే సంగతులు. ముందు వెనుక చూసుకోకుండా.. నిజానిజాలు నిర్ధరించుకోకుండా సోషల్ మీడియా పోస్టులను వైరల్ చేస్తుంటారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పహల్గాం (కశ్మీర్) ఉగ్రదాడికి సంబంధించి సోషల్ మీడియాలో బోలెడన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి.. ఒక జంట కశ్మీర్ అందాల మధ్య చేసిన రీల్.
ఒక హిందీ పాటకు సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో అది. అది ఉన్న ఉగ్రదాడిలో మరణించడానికి ముందు చివరగా చేసిన వీడియో అది అంటూ ప్రచారం చేస్తున్నారు. పెళ్లయిన ఆరు రోజులకే వినయ్ నర్వాల్ అనే నేవీ ఆఫీసర్ ప్రాణాలు కోల్పోవడం తెలిసిన సంగతే. భార్యతో కలిసి కశ్మీర్‌లో హనీమూన్‌లో ఉన్న అతణ్ని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. భర్త మృతదేహం వద్ద భార్య రోదిస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో పాటుగా ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో తిరిగింది. అందులో ఒక జంట కశ్మీర్ అందాల మధ్య డ్యాన్స్ చేస్తోంది.
అందులో ఉన్నది వినయ్ నర్వాల్, ఆయన భార్యే అంటూ ప్రచారం మొదలుపెట్టారు. వాస్తవానికి ఆ వీడియోలో ఉన్నది వేరే జంట. ఆ జంట ఇప్పుడు తీవ్ర ఇబ్బంది పడుతూ ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చింది. తన భర్తతో పాటు తానూ బతికే ఉన్నానని.. తమ మీద ఉగ్రదాడి జరిగినట్లు ప్రచారం చేస్తుండడంతో తెలిసిన వాళ్లందరూ ఫోన్లు చేసి తీవ్ర ఆందోళన చెందుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త నేవీ ఆఫీసర్ అని.. కానీ తమ పాత వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తూ తమ మీద దాడి జరిగినట్లు, తన భర్త చనిపోయినట్లు ప్రచారం చేయడం కరెక్ట్ కాదని.. మీడియా వాళ్లు ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని వాళ్లు విన్నవించారు.