పల్లెలంటే ప్రాణం.. రాజకీయాలు చూడం: పవన్ కల్యాణ్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు పాలనలో పెద్దగా అనుభవం లేదని చెప్పాలి. ఓ డిప్యూటీ సీఎంగా ఉన్న నేత ఈ విషయాన్ని అంత ఈజీగా ఒప్పుకోరనే చెప్పాలి. అయితే పవన్ మాత్రం అందుకు విరుద్ధం. ఎందుకంటే… పాలనలో తనకు తగిన మేర అనుభవం లేదని ఆయనే బహిరంగంగా ప్రకటించారు. అయినా కూడా పల్లె ప్రగతి కోసం అహరహం శ్రమిస్తున్నామని  ఆయన పేర్కొన్న తీరు అందరినీ ఆకట్టుకుంది. గురువారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా పవన్ నోట నుంచి ఈ మాటలు వినిపించాయి. అంతేకాకుండా పల్లెలంటే తనకు ప్రాణమని, అందుకే ఏరికోరి మరీ పల్లె ప్రగతి కోసం పనిచేస్తున్న పంచాయతీరాజ్ శాఖను ఎంచుకున్నానని ఆయన తెలిపారు. పల్లెల ప్రగతి కోసం గ్రామాభివృద్ధిలో రాజకీయాలకు తావివ్వకుండా వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి రికార్డు విక్టరీ కొట్టగా… టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొత్తగా కొలువుదీరిన కూటమి సర్కారులో పవన్ కు డిప్యూటీ సీఎం పదవి దక్కిన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్… గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖలను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇదే అంశాన్ని ప్రస్తావించిన పవన్.. పల్లెల్లో నివాసం ఉండాలంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. అయితే కుదరకపోయినా..  కనీసం పల్లెలను ప్రగతి పథంలో నడిపే దిశగా సాగుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పల్లెల ప్రగతిలో ఎలాంటి రాజకీయ జోక్యాలను సహించట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 70 నుంచి 80 శాతం మేర పంచాయతీల్లో వైసీపీకి చెందిన వారే సర్పంచులుగా ఉన్నారన్న పవన్… ఆ గ్రామాలను కూడా ఇతర గ్రామాల మాదిరిగానే అభివృద్ధి బాట పట్టిస్తున్నామని తెలిపారు.

రాజకీయం, వర్గ పోరు, కులాల మధ్య చిక్కుకుపోయిన పల్లెలను ఆ ఊబి నుంచి బయటకు తీసుకువస్తున్నామని పవన్ చెప్పారు. ఇందుకోసం రాజకీయాలను చూడకుండా అభివృద్ధిని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుని సాగుతున్నామని చెప్పారు. ఈ కారణంగానే గ్రామం గ్రామమే… సర్పంచ్ సర్పంచే అన్న నినాదంతోను ముందుకు కదులుతున్నామని తెలిపారు. ఈ కారణంగానే స్వతంత్ర, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజకీయాలకు అతీతంగా ప్రతి పల్లెకూ ఆ పల్లె స్థాయిని బట్టి రూ.10 వేలు, రూ.25 వేలను అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగానే ఆయన తనకు పాలనా అనుభవం లేని విషయాన్ని ప్రస్తావించారు. తనకు పాలనలో పెద్దగా అనుభవం లేకున్నా… తన శాఖ పరిధిలో చిన్న పైరవీలు కూడా లేకుండా చేశానని తెలిపారు. తన మాటను అధికారులు పక్కాగా అమలు చేస్తున్నారన్న పవన్.. ఆ మాటను దాటితే ఎవరిపై అయినా కఠిన చర్యలు తప్పవని కూడా పవన్ హెచ్చరికలు జారీ చేశారు.