కశ్మీర్ లోని పెహల్ గాంలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కశ్మీర్ లోని పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్ర దాడి వెనుక దాయాదీ దేశం పాకిస్తాన్ హస్తం ఉందని నిర్ధారించిన భారత్… పాక్ తో సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన భద్రతపై కేబినెట్ కమిటీ భేటీలో కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయంతో పాక్ తో భారత్ సంబంధాలు పూర్తిగా రద్దు అవుతాయి. పాక్ పౌరులను ఏ రకంగానూ భారత్ లోకి అనుమతించరు. అంతేకాకుండా పాక్ తో దౌత్యపరమైన సంబంధాలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయి.
భద్రతపై కేబినెట్ కమిటీ భేటీ ముగిసిన వెంటనే కేంద్రం తీసుకున్న నిర్ణయాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. ప్రస్తుతం భారత్ లో ఉన్న పాక్ పర్యాటకులతో పాటు ఇతరత్రా పనుల నిమిత్తం భారత్ వచ్చిన ఆ దేశ పౌరులు భారత్ ను వీడేందుకు కేవలం 48 గంటల వ్యవధిని ఇస్తున్నట్లు మిస్రీ తేల్చి చెప్పారు. అంటే.. గురు, శుక్రవారా ల్లోగా పాక్ పౌరులు భారత్ ను వీడాల్సి ఉంటుంది. ఇకపై భారత్ లోకి పాక్ పర్యాటకులను గానీ, ఇతరత్రా ఏ కారణాలతో అయినా గానీ ఆ దేశ పౌరులను అనుమతించేది లేదని కూడా తేల్చి చెప్పారు. అంతేకాకుండా భారత్ లోని పాక్ హై కమిషనర్ ను దేశం వదిలి వెళ్లిపోవాల్సింది ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి.
ఇదిలా ఉంటే… పాక్ ఇప్పటిదాకా కొనసాగుతున్న భారత సంబంధాలు పూర్తిగా స్తంభించనున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న అటారీ-వాఘా సరిహద్దును తక్షణమే మూసివేస్తున్నట్లుగా మిస్రీ వెల్లడించారు. అంతేకాకుండా ఇరు దేశాల మధ్య అమలు అవుతున్న సింధూ జలాల ఒప్పందాన్ని కూడా తక్షణమే నిలిపివేస్తున్నట్లుగా కూడా కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన ప్రకటించారు. పెహల్ గాం ఉగ్ర దాడి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల మార్గదర్శకత్వంలోనే జరిగిందని, దాడికి పాకిస్తాన్ సైన్యాధిపతి నుంచి కూడా పూర్తిగా సహకారం అందిందన్న ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. దీంతోనే ఈ దాడిని ఈజీగా తీసుకోరాదన్న నేపథ్యంలో కేంద్రం కఠిన నిర్ణయాన్ని తీసుకుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.