కూట‌మి స‌ర్వే – రిజల్ట్ ఏంటంటే…

కూటమి ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో సంతృప్తి 80 శాతం వ‌ర‌కు ఉన్న‌ట్టు తాజా స‌ర్వే ఒక‌టి తేల్చి చెప్పింది. గ‌త నెల రోజులుగా సీఎం చంద్రబాబు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఇంటింటి స‌ర్వే సాగుతోంది. రాష్ట్రంలో చ‌దువుకున్న వారు.. నిరుద్యోగులుగా ఉన్న‌వారు.. ప‌నులు చేస్తున్న‌వారు.. చేతివృత్తుల్లో ఉన్న‌వారు.. ఇలా విభాగాల వారీగా ప్ర‌జ‌ల సంఖ్య‌ను తెలుసుకుంటున్నారు. ప‌నిలో ప‌నిగా.. కూట‌మి స‌ర్కారు చేస్తున్న ప‌నులు, ఇస్తున్న ప‌థ‌కాల‌పైనా స‌ర్వే చేశారు.

దీనిలో చ‌దువుకుని కూడా నిరుద్యోగంలో ఉన్నామ‌ని 30 శాతం మంది చెప్పారు. మ‌రో 60 శాతం మంది సొంత కాళ్ల‌పైనిల‌బ‌డ్డామ‌ని.. స్వ‌యంగా వ్యాపారాలు, పనులు చేసుకుంటున్నామ‌ని వివ‌రించారు. ఇక‌, 10 శాతం మంది మాత్రం.. ఉద్యోగాలు చేసుకుంటున్న‌ట్టు తేలింది. చ‌దువుకుని నిరుద్యోగులుగా ఉన్న 30 శాతం మందికి ప‌నులు చూపించేందుకు ప్ర‌త్యేక క్ల‌స్ట‌ర్ల‌ను ఏర్పాటు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు యోచి స్తున్నారు. వీటిని నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఏర్పాటు చేయ‌నున్నారు.

ఇక‌, ఈ స‌ర్వేలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న పలు ప‌థ‌కాల‌పై సంతృప్తి వ్య‌క్త‌మైంద‌ని సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి. పింఛ‌న్ల పంపిణీ, ఉచిత గ్యాస్ సిలిండ‌ర్లు.. వంటివి మంచి పేరు తెచ్చిపెడుతున్నాయ‌ని స‌ర్వే లో పేర్కొన్నారు. అలానే.. ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ రాక‌ల ద్వా రా.. త‌మ క్షేత్ర‌స్థాయి స‌మ‌స్య‌ల‌ను వారికి విన్న‌వించుకునే అవ‌కాశం ఏర్ప‌డింద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు, ఇదే స‌ర్వేలో.. కొన్ని మైన‌స్‌లు కూడా ఉన్నాయి. నాయ‌కులు త‌మ‌కు అందుబాటులో ఉండడం లేద‌న్న‌ది మెజారిటీ ప్ర‌జ‌లు చెప్పిన మాట‌. క్షేత్ర‌స్థాయిలో త‌మ స‌మ‌స్యలు విన్న‌వించుకునేందుకు కూడా ఎవ‌రూ అందుబాటులో ఉండడం లేద‌ని.. ఫిర్యాదులు కూడా వ‌చ్చాయి. ఇక‌, ఇసుక‌, మ‌ద్యం విష‌యాల‌పైకొన్ని కొన్ని జిల్లాల్లో అసంతృప్తులు ఎక్కువ‌గానే క‌నిపించాయి. అయిన‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్‌గా 80 శాతం వ‌ర‌కు సంతృప్తిగానే ఉన్నార‌న్న‌ది తాజాగా నిర్వహించిన స‌ర్వే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.