హైడ్రాకు వ్యతిరేకంగా కోబ్రా..!

తెలంగాణలో ప్రత్యేకించి భాగ్యనగరి హైదరాబాద్ లో హైడ్రా పేరు వింటేనే జనం హడలెత్తిపోతున్నారు. హైదరాబాద్ లోని నాలాలు, చెరువుల పరిరక్షణ కోసం అంటూ ఎనముల రేవంత్ రెడ్డి నేతత్వంలోని కాంగ్రెస్ సర్కారు తీసుకువచ్చిన ఈ కొత్త వ్యవస్థ ఇప్పటికే చాలా ఆస్తులను ప్రభుత్వానికి స్వాధీనం చేసింది. అదే సమయంలో పలువురు పేదలతో పాటు కొందరు పెద్దల నిర్మాణాలను కూడా హైడ్రా కూల్చేసింది. హైడ్రాపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, ఆ పార్టీ యువ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు వ్యతిరేకంగా తాము కోబ్రాను తీసుకువస్తామని కార్తీక్ రెడ్డి ఇంటరెస్టింగ్ కామెంట్లు చేశారు.

చేవెళ్ల పరిధిలోరి పలు పార్టీలకు చెందిన కొందరు నేతలు ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు కార్తీక్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కార్తీక్ రెడ్డి… హైడ్రా తీరును దుయ్యబట్టారు. హైడ్రాకు పేదల ఆస్తులు, విపక్షాలకు చెందిన నేతల ఆస్తులు మాత్రమే అక్రమంగా కనిపిస్తాయని, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల ఆస్తులు మాత్రం ఎంత అక్రమమైనా కూడా సక్రమంగానే కనిపిస్తాయని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులను కాంగ్రెస్ పార్టీ నేతలకు దోచి పెట్టేందుకే హైడ్రా పనిచేస్తోందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ అసెట్ ప్రొటెక్షన్ పేరిట రంగంలోకి దిగిన హైడ్రా.. అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

మరో మూడేళ్లలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కార్తీక్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే.. హైడ్రాకు వ్యతిరేకంగా కోబ్రాను ఏర్పాటు చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నేతలు దురాక్రమించిన ఆస్తుల పరిరక్షణ కోసమే కోబ్రాను ఏర్పాటు చేస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అన్యాక్రాంతం అయిన సర్కారీ భూములన్నింటినీ తిరిగి స్వాధీనం చేసుకుని తీరతామని ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా మైలార్ దేవ్ పల్లి సమీపంలో ఇటీవల రోడ్డు విస్తరణ నిమిత్తం పేదల ఇళ్లను కూల్చిన హైడ్రా, వాటి పక్కనే ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిని మాత్రం కూల్చలేదని ఆయన ఆరోపించారు. దీనిని బట్టే హైడ్రా తీరు ఎలా ఉందో చెప్పవచ్చని ఆయన సోదాహరణంగా వివరించారు. ఈ తరహా దుర్మార్గాలను నిర్మూలించే పనిని కూడా కోబ్రా తీసుేకుంటుందని కార్తీక్ రెడ్డి చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎక్కడెక్కడ, ఎంతెంత విస్తీర్ణంలో ఎన్నెన్ని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న గణాంకాలు తమ వద్ద ఉన్నాయని కార్తీక్ రెడ్డి చెప్పారు. ఈ భూములను కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏఏ నేతలు లాగేశారన్న వివరాలు కూడా తమ వద్ద ఉన్నాయన్నారు. ఈ దిశగా మరింత మేర పక్కా వివరాలు బయటకు తీస్తామని కూడా ఆయన పేర్కొన్నారు. వీటన్నింటిపైనా బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే చర్యలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. ఒకింత సాఫ్ట్ గానే మాట్లాడిన కార్తీక్ రెడ్డి… హైడ్రా చర్యలను మాత్రం తనదైన శైలిలో విస్పష్టంగా విమర్శించారని, అంతేకాకుండా హైడ్రా చర్యలకు విరుగుడుగా తామేం చేయాలనుకున్న విషయాన్ని కూడా ఆయన బహిరంగంగానే చెప్పడం విశేషం. ఈ వ్యాఖ్యలన్నీ కార్తీక్ రెడ్డి… కేటీఆర్ సమక్షంలోనే చేయడం గమనార్హం.