ఏపీలో మద్యం కుంభకోణం విచారణ కోసం ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణకు హాజరైన వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణం మొత్తం ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి నేతృత్వంలోనే జరిగిందని ఇదివరకే చెప్పిన మాటను సాయిరెడ్డి శుక్రవారం కూడా మరోమారు వినిపించారు. మద్యం కుంభకోణం మొత్తాన్ని రాజ్ కసిరెడ్డే నడిపించారని ఆయన తేల్చిచెప్పారు. అయితే ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి సంబంధం ఉందా? లేదా? అన్నది తనకు తెలియదన్న సాయిరెడ్డి… ఆ విషయాన్ని మిథున్ రెడ్డినే అడగాలని వ్యాఖ్యానించారు.
శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ పోలీస్ కమిషనరేట్ లోని సిట్ కార్యాలయానికి వెళ్లిన సాయిరెడ్డి… దాదాపుగా 3 గంటల పాటు సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్ కసిరెడ్డిని ఆయన తెలివైన క్రిమినల్ గా అభివర్ణించారు. అంతటి క్రిమినల్ మైండెడ్ వ్యక్తిని తానెప్పుడూ చూడలేదన్న సాయిరెడ్డి…కసిరెడ్డిని పార్టీలోని కొందరు నేతలు తనకు పరిచయం చేయగా … అతడి మనస్తత్వం తెలియక తానే అతడి ఎదుగుదలకు తోడ్పాటు అందించానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డ కసిరెడ్డి తనను ఓ రకంగా మోసం చేసినట్టేనని కూడా సాయిరెడ్డి అన్నారు. అయితే ఈ మోసం వల్ల తానేమీ కోల్పోలేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
వైసీపీ అదికారంలోకి వచ్చాక 2019 చివరలో హైదరాబాద్ లోని జర్నలిస్టు కాలనీ పరిధిలో ఉన్న తన ఇల్లు, ఆ తర్వాత విజయవాడలో తన నివాసం ఉంటున్న విల్లాలో రెండు సార్లు సమావేశాలు జరిగాయని, ఈ సమావేశాల్లో నూతన మద్యం పాలసీపై చర్చలు జరిగాయని సాయిరెడ్డి తెలిపారు. ఈ సమావేశాల్లో రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డి, సత్య ప్రసాద్, తాను పాలుపంచుకున్నామని తెలిపారు. అయితే ఈ సమావేశాలకు నాడు సీఎం సెక్రటరీగా వ్యవహరించిన ధనుంజయ్ రెడ్డి గానీ, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి గానీ హాజరు అయినట్టుగా తనకు గుర్తు లేదన్నారు. దీనిపై గుర్తు చేసుకుని అలాంటిదేదైనా ఉంటే తర్వాత తెలియజేస్తానని సిట్ అధికారులకు చెప్పానన్నారు. ఈ సమావేశం అనంతరం రాజ్ కసిరెడ్డి, మిథున్ రెడ్డిలు తనను రూ.100 కోట్ల రుణం ఇప్పించమని అడిగితే… అరబిందో శరత్ చంద్రారెడ్డి చేత ఇప్పించానని తెలిపారు.
ఇది తప్పించి మద్యం కుంభకోణం గురించి తనకేమీ తెలియదని సాయిరెడ్డి తెలిపారు. ఇదే విషయాన్ని సిట్ కు చెప్పానని ఆయన వెల్లడించారు. మద్యం పాలసీ రూపొందే తొలినాళ్లలోనే తాను ఉన్నానని, ఆ తర్వాత దానితో తనకు ఎంతమాత్రం సంబంధం లేదన్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంలో ముడుపులు చేతులు మారాయా? ఎంతమేర అక్రమాలు జరిగాయి? వీటిలో ఎవరెరవరి పాత్ర ఉంది? మిథున్ రెడ్డి ఏ మేరకు బాధ్యుడు? రాజ్ కసిరెడ్డి ఈ నిధులను ఎక్కడ పెట్టారు?.., ఇలాంటివన్నీ తనకు ఎలా తెలుసునని ఆయన ప్రశ్నించారు. మిథున్ రెడ్డికి పాత్రపై ప్రశ్నిస్తే… రేపు ఆయన విచారణకు వస్తున్నారుగా… ఆయననే అడగండి అంటూ సాయిరెడ్డి చెప్పారు. ఇక ఎంతమేర నిధులు దుర్వినియోగం అయ్యాయన్న విషయాన్ని కసిరెడ్డే చెప్పాలన్నారు.
ఇక తన రాజకీయ రంగ పున:ప్రవేశంపై మీడియా సంస్థలు రాస్తున్న వార్తా కథనాలపై సాయిరెడ్డి ఒకింత విరుచుకుపడ్డారు. గతంలో ఏబీఎన్ ఈనాడులపై విమర్శలు గుప్పించిన సాయిరెడ్డి… ఈ దఫా మాత్రం ఆ జాబితాలో సాక్షి మీడియాను కూడా చేర్చారు. ఇటీవల సాక్షిలో జరిగిన ఓ చర్చలో తన గురించి అవాకులు చెవాకులు పేలారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక వైసీపీలో తన స్థానంపై వస్తున్న వార్తలపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పార్టీ ప్రారంభం సమయంలో జగన్ తర్వాత తానే ఉన్నానని… నాడు తన స్థానం రెండోదేనని ఆయన వ్యాఖ్యానించారు. అయితే జగన్ చుట్టూ చేరిన కోటరీ తనపై జగన్ కు లేనిపోని ఫిర్యాదులు చేసిందన్నారు. సాయిరెడ్డి చేతిలో వెన్నుపోటు తప్పదని కూడా జగన్ ను వారు హెచ్చరించారన్నారు. ఈ కారణంగా జగన్ తనను దూరం పెడుతూ వచ్చారని… ఫలితంగా రెండో స్థానంలో ఉన్న తాను ఏకంగా 2 వేల స్థానంలోకి పడిపోయానని తెలిపారు. వైసీపీలో తాను పడినన్ని అవమానాలు ఇంకెవ్వరూ పడి ఉండరన్న సాయిరెడ్డి…ఈ కారణంగానే తాను వైసీపీకి గుడ్ బై చెప్పానన్నారు.