కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల చెంత తిరుపతిలో గురువారం రాజకీయ రచ్చ చోటుచేసుకుంది. అధికార కూటమి, విపక్ష వైసీపీ నేతల మధ్య తిరుపతి గోశాలలో గోవుల మృతిపై గత కొన్ని రోజులుగా విమర్శలు, ప్రతి విమర్శలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. అసలే రాజకీయాలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా ఉండాల్సిన చోట ఇలా నానాటికీ రాజకీయ రచ్చ పెచ్చు మీరుతున్న వైనం భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నిన్నటిదాకా మాటలకు పరిమితమైన రాజకీయ పార్టీలు గురువారం ఏకంగా బాహాబాహీకి దిగేంతగా పరిస్థితిని తీసుకువెళ్లాయి. గోవుల మరణాలపై చర్చ అంటూ టీడీపీ సవాల్ విసరగా… అందుకే సై అన్న వైసీపీ వివాదానికి మరింతగా ఆజ్యం పోసింది. ఫలితంగా గురువారం తిరుపతి నగరం రాజకీయ రణ రంగాన్ని తలపించింది.
తిరుపతి గోశాలలో గడచిన 3 నెలల్లోనే 100 మేర గోమాతలు మృత్యువాత పడ్డాయంటూ తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి రాజకీయ రచ్చకు తెర తీశారు. వాస్తవంగా తిరుమల వేదికగా ఏ చిన్న విషయం జరిగినా… కూటమి ప్రభుత్వమైనా, ఇంకే పార్టీ ప్రభుత్వం అయినా కూడా వేగంగా స్పందిస్తాయి. ఈ క్రమంలోనే గోశాలపై భూమన అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూటమి సర్కారు విరుచుకుపడింది. జరిగింది ఒకటైతే… దానికి రాజకీయ దురుద్దేశాలను ఆపాదిస్తూ భూమన కల్పిత కథలను ప్రచారం చేస్తున్నారంటూ ప్రభుత్వంతో పాటుగా టీటీడీ పాలక మండలి కూడా ప్రతిస్పందించింది. అప్పటికీ ఆగని భూమన… టీటీడీ, ప్రభుత్వ ప్రకటనలపైనా మరోమారు కీలక ప్రకటనలు చేశారు. పొంతన లేని ప్రకటనలు చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వాన్ని అసహనానికి గురి చేశాయి.
ఈ క్రమంలో అసలు గోశాలలో ఏం జరుగుతోందన్న దానిపై మీకు కనీస అవగాహన ఉందా? అంటూ భూమనను నిలదీసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. దమ్ముంటే ఈ విషయంపై చర్చకు సిద్ధమా? అంటూ ఆయన సవాల్ విసిరారు. అప్పటికీ సంయమనం పాటించాల్సిన గురుతర బాధ్యతను వదిలేసిన భూమన… పల్లా సవాల్ కు తాను సిద్ధమేనని ప్రకటించి కాక రేపారు. ఈ క్రమంలో గురువారం చర్చ కోసం కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు తిరుపతిలోని గోశాలకు చేరుకున్నారు. కేవలం నేతలు, వారి సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఈ చర్చ కోసం వచ్చారు. అయితే అందుకు విరుద్ధంగా తాను తన అనుచర వర్గాన్ని తీసుకుని చర్చకు వెళతానంటూ భూమన బయలుదేరారు. దీనికి అభ్యంతరం చెప్పిన పోలీసులు… మీరు వెళుతున్నది చర్చ కోసం… కూటమి నేతలతో గొడవకు కాదు.. శాంతి భద్రతల నేపథ్యంలో చర్చకు వెళతానంటే సరే తానీ… మందీ మార్బలాన్ని వెంటేసుకుని వెళతామంటే కుదరని తేల్చి చెప్పారు.
ఇదే అదనుగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి నారాయణ స్వామిలతో కలిసి భూమన తన ఇంటి వద్ద నడిరోడ్డుపై అడ్డంగా పడుకుండిపోయారు. తన అనుచరులతోనే గోశాలకు తనను అనుమతించాలని ఆయన పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి, తిరుపతి స్థానిక వైసీపీ నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినా చర్చ కోసమే అయితే మందీ మార్బలాన్ని వెంటేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముందని స్థానికులు కూడా భూమన వర్గాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నిత్యం గోవింద నామస్మరణతో మారు మోగాల్సిన చోట… గోమాతల మరణాలను లాగి రాజకీయ రచ్చ చేయడం భూమనకు తగునా? అంటూ జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్ానరు. అయినా భూమన చెబుతున్నట్లుగా గోమాతల మరణాలు జరిగే ఉంటే.. ఇప్పటికే ప్రారంభమైన విచారణలో ఆ వివరాలు బయటకు వచ్చి… అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటారు కదా.. అది వదిలేసి ప్రశాంతమైన తిరుపతిలో ఈ రాజకీయ రచ్చ ఏమిటంటూ వారు ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు.