టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మంగళవారం అమరావతిలోని సచివాలయంలో జరిగింది. దాదాపుగా 3 గంటలకు పైగా సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ పూర్తి అయిన తర్వాత..కేబినెట్ మంత్రులతో చంద్రబాబు రాజకీయ అంశాలపై కీలక చర్చను చేపట్టారు. కూటమి సర్కారును అప్రతిష్ఠ పాలు చేసేందుకు వైసీపీ వ్యవహరిస్తూనే ఉందని ఆరోపించిన చంద్రబాబు… వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టే విషయంలో కూటమి పార్టీల మంత్రులు సత్తా చాటలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులుగా ఉండి…ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలిసి కూడా విపక్షం చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతే ఎలాగంటూ చంద్రబాబు మంత్రులను నిలదీశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఇది సరిపోదు..మరింతగా శక్తిని కూడదీసుకోవాల్సిందే. వైసీపీని, ఆ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిందే. లేదంటే ప్రజలకు వాస్తవాలేమిటో తెలియవు. ఇదే అదనుగా వైసీపీ ప్రభుత్వంపై మరింతగా దుష్ప్రచారం చేస్తుంది. ఆ పార్టీ చెప్పేదే నిజమని ప్రజలు నమ్ముతారు. ఇది చాలా ప్రమాదకరం. దీనికి ఎక్కడికక్కడ అడ్డుకట్ట పడాలి. లేదంటే చాలా విపరిణామాలు చూడాల్సి వస్తుంది. దుష్ప్రచారంలో వైసీపీని మించిన పార్టీ మరొకటి లేదు. వైసీపీ వరుసబెట్టి ఆయా అంశాలను ఎంచకుంటోంది. తొలుత వక్ఫ్ బిల్లు, ఆ తర్వాత పాస్టర్ ప్రవీణ్ మరణం, తాజాగా తిరుమల గోశాలలో గోవుల మరణాలు..ఇలా వైసీపీ దుష్ప్రచారాలను కంటిన్యూ చేస్తుంటే.. వాటిని అడ్డుకోవాలి కదా. ప్రస్తుతం ఒకరిద్దరు మాట్లాడుతున్నా… పూర్తి స్తాయిలో మన వెర్షన్ ప్రజలకు చేరడం లేదు. ఇకనైనా వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా సిద్ధపడాలి” అని చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు ఓ కీలక అంశాన్ని ప్రస్తావించారు. 2014-19 మధ్యలో కూడా వైసీపీ విపక్షంలోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నాడు టీడీపీ అధికారంలో ఉండగా.. ఇప్పుడు చేసిన మాదిరే నాడు కూడా వైసీపీ దుష్ప్రచారం చేసిందని ఆయన తెలిపారు. నాడు వైసీపీ దుష్ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోని వైనాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ ఏమరపాటు కారణంగానే… జనాలను మభ్యపెట్టిన జగన్.. తన పార్టీని గెలిపించుకున్నారని, రాష్ట్రాన్ని విధ్వంసం బాట పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు వైసీపీ దుష్ప్రచారాన్ని గుర్తించి టీడీపీ తిప్పికొట్టగలిగి ఉంటే.. 2019 ఎన్నికల్లో టీడీపీకి అపజయమన్న మాటే లేదని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతానుభవాలను గుర్తు చేసుకుని వైసీపీ కుట్రలకు ఆదిలోనే చెక్ పెట్టేలా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. ఆ దిశగా మంత్రులంతా ప్రిపేర్ కావాలని ఆయన దిశానిర్దేశం చేశారు.