మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ పనిని చేయడం వల్ల శ్వాస సంబంధిత వ్యాధులు, విషవాయువుల బారిన పడే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా మ్యాన్‌హోల్‌లో ప్రమాదాలు కూడా ఎక్కువే. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది.
రాబోయే రోజుల్లో మ్యాన్‌హోల్ శుభ్రపరిచే పని ఇక మనుషులదే కాదు… రోబోలదే అవుతుందని చెప్పొచ్చు. దేశంలో మొదటిసారిగా మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా 100 రోబోల కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వీటిని రాష్ట్రంలోని 27 మున్సిపల్ కార్పొరేషన్లకు పంపిణీ చేయాలని భావిస్తోంది. చత్రపతి శంభాజీనగర్‌లో ట్రయల్ రన్ మొదలవుతుందనీ, అక్కడ ఫలితాలు సానుకూలంగా వస్తే అన్ని నగరాల్లో వీటిని అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
ఇప్పటికే దేశీయంగా తయారైన కొన్ని రోబోలను టెస్ట్ చేయగా.. అవి మురుగు తొలగింపుతో పాటు వ్యర్థాలను వేరుచేసే సామర్థ్యంతో ఆకట్టుకున్నాయని తెలుస్తోంది. ఈ నిర్ణయం వెనుక కీలక కారణం పారిశుద్ధ్య కార్మికుల భద్రత. 2021 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 18 మంది కార్మికులు మ్యాన్‌హోల్స్ శుభ్రం చేస్తూ ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర సామాజిక సాధికారత మంత్రిత్వశాఖ చేసిన ఆడిట్ నివేదికలో అధికారుల నిర్లక్ష్యం, భద్రతా చర్యల లోపాలు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ లేకపోవడం వంటి విషయాలు వెల్లడయ్యాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం మెషిన్ల ఆధారిత వ్యవస్థవైపు మళ్లడం శుభపరిణామంగా చెప్పొచ్చు. రోబోలు మానవ శ్రమను తగ్గించడమే కాదు… ప్రమాదాలను పూర్తిగా నివారించగలవు. ఇవి మానవులకు అశుభ్రంగా ఉండే పనుల నుంచి విముక్తి కల్పించనున్నాయి. ముఖ్యంగా గ్యాస్ డిటెక్షన్, నైట్ విజన్ కెమెరాలు, మల్టీ ఆపరేషన్ల సామర్థ్యం ఉండటంతో ఇవి భద్రత పరంగా బలంగా నిలుస్తాయి. అలాగే రోబోటిక్ టెక్నాలజీ ప్రోత్సాహానికి ఇది గొప్ప ముందడుగు కానుంది. దేశీయంగా తయారీ అయిన ఈ పరికరాలు, “మెడ్ ఇన్ ఇండియా” ధోరణిని కూడా ప్రోత్సహిస్తున్నాయి.