రాజకీయాల్లోకి అఖిల భారత ఉద్యోగులు రావడం సహజం అయిపోయింది. ఉద్యోగాలు విరమణ చేసిన వారు కొందరు.. మధ్యలోనే పీక్ స్టేజ్‌లో ఉన్న స్థితిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని బయటకు వచ్చిన వారు మరికొందరు. ఎలా చూసినప్పటికీ.. వీరి లక్ష్యం రాజకీయాలు. అందరిబాటా.. ప్రజా క్షేత్రమే. కానీ.. వీరిలో విజయందక్కించుకున్నవారు ఎవరు? ఎంత మంది? అంటే.. ప్రశ్నలు తప్ప సమాధానం లేదు. అయినా.. ఏటికి ఎదురీదుతున్నట్టు వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఏపీకి చెందిన ఏబీ వెంకటేశ్వరరావు కూడా.. రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించిన దరిమిలా ఈ చర్చసాగుతోంది.
జయప్రకాశ్ నారాయణ: ఏపీలో తొలిసారి కలెక్టర్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయ బాట పట్టారు జయప్ర కాశ్ నారాయణ. లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసుకున్న ఆయన తర్వాత.. దీనినే రాజకీయ పార్టీగా మలుచుకున్నారు. 2009 ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచి ఒకే ఒక్కసారి .. ఆ పార్టీ తరఫున ఒకే ఒక్క నాయకుడిగా విజయం దక్కించుకున్నారు. తర్వాత.. మళ్లీ కనుమరుగయ్యారు. ప్రస్తుతం విశ్లేషకుడిగా మాత్రమే ఉండిపోయారు.
జేడీ లక్ష్మీనారాయణ: ఉన్నతస్తాయిలో కొనసాగుతున్న సమయంలోనే వాలంటరీ రిటైర్‌మెంటు తీసుకుని రాజకీయాలలోకి వచ్చిన ఐపీఎస్ అధికారి జేడీ. తొలినాళ్లలో జనసేనలో చేరి విశాఖపట్నం నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత సొంతగా పార్టీ పెట్టుకున్నా.. దానిని కూడా పుంజుకునేలా చేయలేకపోయారు. ప్రస్తుతం తటస్థ రాజకీయాలకు ఆయన కేంద్రంగా ఉన్నా.. ప్రొజెక్టు కాలేక పోయారు. ప్రజల ఆశీర్వాదం పొందలేకపోయారు.
అన్నామలై: మన రాష్ట్రానికి చెందిన వ్యక్తికాకపోయినా.. పిన్న వయసులోనే ఐపీఎస్‌కు ఎంపికై.. కర్ణాటకలో ఎస్పీగా పనిచేశారు. తర్వాత.. బీజేపీలో చేరి అనతికాలంలో ఐపీఎస్‌కు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. నాలుగేళ్లపాటు తమిళనాడు బీజేపీకి చీఫ్‌గా వ్యవహరించారు. కానీ.. ప్రజల మద్య విజయం దక్కించు కోలేక పోయారు. ఒకసారి అసెంబ్లీకి.. మరోసారి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవలబీజేపీ ఆయనను చీఫ్ పదవినుంచి కూడా తప్పించింది.
ఏబీవీ: ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన ఆలూరి బాల వెంకటేశ్వరరావుకు.. నేరుగా ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఏమీ లేదు. అయితే.. కమ్మ సామాజికవర్గం అనే ఒక్క ట్యాగ్ మాత్రమే ఆయనకు కలసి వచ్చే అవకాశం. కానీ.. ఇది కూడా ఎంతవరకు? అనే విషయాన్ని గమనిస్తే.. చెప్పడం కష్టమే. వ్యక్తిగత అజెండాను ఎంచుకుంటే.. ముందుకు సాగడం కష్టం. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates