బాబుకు చిర్రెత్తితే ఇంతే.. ఫైబ‌ర్ నెట్ ప్ర‌క్షాళ‌న‌!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు చిర్రెత్తుకొస్తే.. ఏం జ‌రుగుతుందో తాజాగా అదే జ‌రిగింది. ఒక్క దెబ్బ‌కు 284 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఇంటికి పంపించారు. వీరిలో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారే 120 మంది ఉన్నార‌ని అధికారులు తెలిపారు. తాజాగా సీఎం చంద్ర‌బాబు.. ఫైబ‌ర్ నెట్‌ను ప్ర‌క్షాళ‌న చేశారు. కొన్నాళ్లుగా దీనిపై అధ్య‌య‌నం చేయ‌డంతోపాటు.. అంత‌ర్గ‌త వివాదాలు.. కుమ్ములాట‌ల‌కు కొన్నాళ్ల కింద‌ట చెక్ పెట్టారు. ఈ క్ర‌మంలోనే ఉన్న‌తాధికారులు, కార్పొరేష‌న్ ప‌ద‌వుల్లో ఉన్న‌వారిని కూడా ప‌క్కన పెట్టారు.

తాజాగా ఫైబ‌ర్ నెట్ ను ప్ర‌క్షాళ‌న చేసే క్ర‌మంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చిన 248 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఒక్క సంత‌కంతో ప‌క్క నపెట్టారు. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వుల‌ను ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వీరంతా వైసీపీ హ‌యాంలో నియ‌మితులైన వారేన‌ని ఎలాంటి విద్యార్హ‌త లేని వారు.. సుమారు 80 మంది ఉన్నార‌ని.. ప‌దోత‌ర‌గతి మాత్ర‌మే చ‌దివిన వారు 100 మంది ఉన్నార‌ని.. మిగిలిన వారిలో చాలా మంది.. డిగ్రీడిస్ కంటిన్యూ చేసిన‌వారేన‌ని పేర్కొన్నారు. అయితే.. స్వ‌ల్పంగా పీజీ చేసిన‌వారు కూడా ఉన్నార‌ని తెలిపారు. వైసీపీ హ‌యాంలో ఫైబ‌ర్ నెట్ ను రాజ‌కీయ పున‌రావాస కేంద్రంగా మార్చారంటూ.. అప్ప‌ట్లో టీడీపీ విమ‌ర్శించింది.

ఇదిలావుంటే.. ఫైబ‌ర్ నెట్ వ్య‌వ‌స్థ ద్వారా గ్రామ గ్రామానికి నెట్‌ను అనుసంధానం చేయ‌డంతోపాటు త‌క్కువ ధ‌ర‌ల‌కే.. నెట్ ఇవ్వ‌డం, టీవీ చానెళ్ల‌ను వీక్షించే అవ‌కాశం క‌ల్పించ‌డంతోపాటు ఫోన్ స‌దుపాయం కూడా ఉంది. నెల‌కు రూ.149 మాత్ర‌మే క‌ట్టుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫైబ‌ర్‌నెట్ కు రాష్ట్రంలో ఒక‌ప్పుడు మంచి ఆద‌ర‌ణ ఉంది. అయితే.. వైసీపీ హ‌యాంలో దీనిలో రాజ‌కీయ నాయ‌కుల ప్ర‌భావం.. కార్య‌క‌ర్త‌ల‌కు ఉద్యోగాలు ఇచ్చిన ఫ‌లితంగా ఈ వ్య‌వ‌స్థ భ్ర‌ష్టు ప‌ట్టింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్పుడు వీటినే ప్ర‌క్షాళ‌న చేస్తూ..చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.