తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిశిత విమర్శలు గుప్పించారు. “అడవుల్లోకి బుల్ డోజర్లు పంపిస్తున్నారు“ అంటూ.. ఆయన ఎద్దేవా చేశారు. తాజాగా హరియాణాలో పర్యటించిన ప్రధాని మోడీ… అక్కడి వన్యప్రాణుల సంరక్షణపై నిర్వహిం చిన సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రస్తావనను తీసుకువచ్చారు.
కాంగ్రెస్ పాలిత తెలంగాణలో అడవుల్లోకి బుల్ డోజర్లు పంపిస్తున్నారని.. తద్వారా వన్యప్రాణులు ప్రాణాలు కోల్పోతున్నాయని విమర్శించారు. అటవీ సంపదను కొల్లగొట్టేందుకు సాధ్యం కాదని.. అందుకే ధ్వంసం చేస్తున్నారని.. నేరుగా కాంగ్రెస్ పేరు పెట్టి విమర్శలు గుప్పించారు. “అడవుల్లోకి బుల్ డోజర్లు పంపడంలోనూ.. వన్యప్రాణుల ప్రాణాలను హరించడంలోనూ.. తెలంగాణ ప్రభుత్వం చాలా బిజీబిజీగా ఉంది. “ అని ఎద్దేవా చేశారు.
ఎందుకిలా?
ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న 400 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ రేగింది. ఈ 400 ఎకరాల్లోనూ దట్టమైన చెట్లు పెరిగిపోయి.. వన్య ప్రాణులుకూడా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక, దీనిని పరిశుభ్రం చేసే క్రమంలో 100 ఎకరాల్లో అటవీ భూములలోని చెట్లను నరికేశారు. దీనిపై బీఆర్ ఎస్ సహా కొందరు కోర్టును ఆశ్రయించారు. దీనిపై యథాతథ స్థితిని కొనసాగించాలని కోర్టు ఆదేశించింది.
ఈలోగా.. ఇదే ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఓ లేడి కూనను కుక్కలు తరిమి తరిమి చంపేశాయి. ఈ పరిణామాలను ఉటంకిస్తూ.. ప్రధాని తాజాగా హరియాణాలో నిర్వహించిన కార్యక్రమంలో వ్యాఖ్యలు చేయ డం గమనార్హం. మరి ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.