తెలంగాణలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ… ఎవరికి ఎంతంటే?

తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోమవారం ఓ కీలక అడుగు వేసింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు అయిన సోమవారం నాడు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకువస్తూ అదికారిక ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగుతో పాటు, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో ఈ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. వెరసి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలులోకి వచ్చినట్టేనని చెప్పాలి. సుదీర్ఘ కాలంగా మాదిగలు వారి తరఫున మంద కృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైంది. 

కొత్తగా జారీ అయిన తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించారు. ఆర్థికంగానే కాకుండా సామాజికంగానూ బాగా వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1 కింద పరిగణించిన ప్రభుత్వం ఆ కులాలకు 1 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. ఇక ఎస్సీల్లో అత్యదిక సంఖ్యలో ఉన్న మాదిగ, మాదిగ ఉపకులాలుగా పరిగణిస్తున్న 18 కులాలను గ్రూప్ 2 కింద పొందుపరచిన ప్రభుత్వం… ఆ కులాలకు 9 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. ఇక గ్రూప్ 3 కింద మాల, మాల ఉపకులాల్లోని మొత్తం 26 కులాను పొందుపరచిన ప్రభుత్వం ఈ కులాలకు 5 శాతం రిజర్వేషన్లను కేటాయించింది. 

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలులోకి తీసుకురావడంతో పాటుగా ఈ మేర వర్గీకరించిన రిజర్వేషన్లను సోమవారం నుంచే అమలులోకి తీసుకువస్తున్నట్లుగా ప్రకటించిన ప్రభుత్వం… ఈ రిజర్వేషన్లను తాజా ఉద్యోగాల భర్తీలోనూ అమలు చేయనున్నట్లు పేర్కొంది. ఈ వర్గీకరణ వల్ల ఇన్నాళ్లుగా జనాభా అధికంగా ఉండి కూడా రిజర్వేషన్లను అందుకోలేక పోయిన మాదిగలకు న్యాయం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తుండగా… మాలలు మాత్రం ఈ రిజర్వేషన్ల వర్గీకరణ తమకు తీరని అన్యాయమే చేస్తుందని ఆరోపిస్తున్నారు. అయితే సమాజంలోని అన్ని వర్గాలు, పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది.