నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధానిగా తీర్చిదిద్దేందుకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి సర్కారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిని ప్రపంచ స్థాయి రాజధాని నగరంగానే కాకుండా అఖండ రాజధానిగా తీర్చిదిద్దాలని కూటమి సర్కారు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఇప్పటికే సేకరించిన 33 వేల ఎకరాల భూములకు అదనంగా మరో 30 వేల ఎకరాల సమీకరణకు దాదాపుగా ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలో కూటమి సర్కారు అధికారికంగా ఓ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి.
2014లో తెలుగు నేల విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా నూతన ప్రస్థానం ప్రారంభించిన ఏపీకి దేశంలోని ఏ ఒక్క రాజధానికి తీసిపోని రాజధానిని నిర్మించాలన్న దిశగా చంద్రబాబు సాగారు. ఇందుకోసం విజయవాడ, గుంంటూరు మధ్యలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేశారు. రాజధాని నిర్మాణం కోసం అంటూ భూములివ్వాలని చంద్రబాబు చేసిన ప్రకటనకు అమరావతి పరిధి రైతుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలో 33 వేల ఎకరాల భూములను భూసేకరణ పద్ధతిలో కాకుండా భూ సమీకరణ పద్ధతిలో నాటి చంద్రబాబు సర్కారు సమీకరించింది. ఇందుకోసం రిటర్నబుల్ ప్లాట్ల పేరిట బాబు సర్కారు చేసిన ప్రతిపాదనపై రైతాంగం హర్షం ప్రకటించింది.
తాజాగా కూటమి సర్కారు అధికారంలోకి రాగా… తిరిగి మరోమారు ఏపీకి చంద్రబాబు సీఎం అయ్యారు. అప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని 10 నెలల కాలంలోనే ఓ దారిలో పెట్టేసిన చంద్రబాబు.. తాజాగా అమరావతిని అఖండ రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ఆయన ఆలోచన చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సమీకరించిన 33 వేల ఎకరాల్లో కోర్ కేపిటల్ ను ఏర్పాటు చేస్తుండగా… దానికి అనుబంధంగా కోర్ కేపిటల్ చుట్టూ మరో 30 వేల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు. కోర్ కేపిటల్ చుట్టూ నిర్మితం కానున్న ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, అమరావతి అవసరాల మేరకు కొత్తగా ఏర్పాటు చేయాల్సిన విమానాశ్రయం తదితరాల కోసం ఈ భూమిని వినియోగిచనున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ఇప్పుడే భూమిని సేకరిస్తే మంచిదన్న భావనతోనే కూటమి సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా 65 వేల ఎకరాల్లో నిర్మితం కానున్న అమరావతి నిజంగానే అఖండ రాజధానిగా రూపుదిద్దుకోనుందన్నవాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.