ముంబై ఐఐటీ స్టూడెంట్స్ కి చంద్రబాబు ఏం చెప్పారు?

భవిష్యత్తు మీద ఆశలతో 2050 టార్గెట్ గా మెగా మైండ్ సెట్ మార్చుకోవాలంటూ చంద్రబాబునాయుడు గట్టిగా చెప్పారు. ముంబయ్ ఐఐటి విద్యార్ధుల కోసం నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ షిప్ సమ్మిట్’ లో ఐఐటి స్టూడెంట్స్ తో వెబినార్ ద్వారా జూమ్ యాప్ లో మాట్లాడారు. రోడ్లు, కరెంటు కూడా లేని 20 ఇళ్ళున్న చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను ముఖ్యమంత్రి అవ్వగా లేనిది ఇప్పటి విద్యార్ధులు భవిష్యత్తులో ఎందుకు ఎదగలేరంటూ చురకలంటించారు. శ్రమ చేయటం, పట్టుదలతో పనిచేయటమే అన్నింటికన్నా ముఖ్యమన్నారు.

సమస్యలు, సంక్షోభాలను చూసి ఎవ్వరు భయపడవద్దని క్లాసు పీకారు. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా ఎలా మలచుకోవాలో ఓపిగ్గా ఆలోచించాలన్నారు. నేటి విద్యార్ధులే సమాజానికి దిక్సూచిగా పనిచేయాల్సిన అవసరం ఉందంటూ చంద్రబాబు గట్టిగా చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తాను ఏపి అభివృద్ధికి చేసిన కృషిని విద్యార్ధులకు వివరించారు.

మనం ఏది సాధించాలన్నా ఓ విజన్ అవసరమని, ఆ విజన్ను సాధించేందుకు అవసరమైన కార్యాచరణ చాలా అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కార్యాచరణ పెట్టుకున్నంత మాత్రాన కుదరదని దాన్ని అచీవ్ చేయటానికి తీవ్రంగా కష్టపడాలన్నారు. మనం కష్టపడటంతో పాటు ఇతులను ఓ టీం లాగ తయారు చేసుకుని అందరినీ ముందుకు తీసుకెళ్ళాలన్నారు. అందరు కలిసి ఓ బృందంగా పనిచేసినపుడే ఏదైనా సాధించగలమనే విషయంపై అందరు నమ్మకం ఉంచుకోవాలన్నారు.

ప్రపంచంలో విస్తరిస్తున్న సాంకేతిక విప్లవాన్ని ప్రతి ఒక్కళ్ళు అందిపుచ్చుకోవాలని గట్టిగా చెప్పారు. సాంకేతిక విప్లవం ద్వారా అద్భుతాలు సృష్టంచవచ్చని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ప్రపంచం ఎదుర్కోబోయే అతి ప్రధానమైన సమస్య వాతావరణ కాలుష్యంగా చంద్రబాబు గుర్తుచేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలని కోరారు. కాలుష్య రహిత సాంకేతికతకు పెద్ద పాట వేసిన వారిదే భవిష్యత్తని చంద్రబాబు జోస్యం కూడా చెప్పారు. మొత్తానికి తన 40 ఏళ్ళ రాజకీయ అనుభవాన్ని చంద్రబాబు ఐఐటి విద్యార్ధులతో పంచుకున్నారు.