వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలి రాప్తాడు పర్యటనపై సాగుతున్న మాటల యుద్ధంలో తాజాగా ఆ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య అలియాస్ పేర్ని నాని శుక్రవారం ఎంట్రీ ఇచ్చారు. రాప్తాడు పర్యటన సందర్భంగా జగన్ డ్రామాలు చేశారని, స్థానిక నేతలు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ హెలికాప్టర్ మరమ్మతుకు గురయ్యేందుకు కూడా మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డే కారణమని టీడీపీ ఆరోపించింది. ఈ మాట నిజమేనని తేల్చిన పోలీసులు ఇప్పటికే తోపుదుర్తిపై కేసు కూడా నమోదు చేశారు. ఈ అన్ని అంశాలపై స్పందించేందుకు శుక్రవారం పేర్ని నాని తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పవర్ ఫుల్ పంచ్ లను అలా సంధిస్తూ సాగారు.
రాప్తాడు పర్యటనలో జగనేమీ డ్రామాలు చేయలేదని పేర్ని నాని అన్నారు. జగన్ కు సినిమా స్టార్లకు మించిన ఫాలోయింగ్ ఉందన్న నాని.. జగన్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి సర్కారుదేనని తెలిపారు. 2019 ఎన్నికలకు ముందు కూడా జగన్ విపక్ష నేతగానే ఉన్నారని , నాడు ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన జగన్ కు పటిష్టమైన భద్రత లభించిందన్నారు. అందుకు కారణం రాష్ట్ర పాలనా యంత్రాంగం కేంద్ర ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటమేనన్నారు. రాప్తాడు పర్యటనలో జగన్ కు భద్రత కల్పించాల్సిన బాధ్యత కూటమి సర్కారుదేనన్నారు. అయితే ఆ బాధ్యతల నుంచి కూటమి సర్కారు తప్పుకుని.. జగన్ కు ఏం జరిగినా తమ బాధ్యత కాదన్నట్లుగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే జగన్ హెలికాప్టర్ దిగకుండానే హెలిప్యాడ్ మొత్తం జనంతో నిండిపోయిందన్నారు.
అయినా జగన్ విపక్ష నేతగా ఉండటం కూటమి దురదృష్ణమని పేర్ని సెటైర్లు సంధించారు. ఎందుకంటే అని తనను తాను ప్రశ్నించుకున్న నాని… అధికారం కూటమి వద్దే ఉన్నా జనం మాత్రం జగన్ వద్ద ఉన్నారని వ్యాఖ్యానించారు. జగన్ ఎక్కడికెళ్లినా తండోపతండాలుగా జనం వస్తుండటమే ఇందుకు కారణమని కూడా ఆయన అన్నారు. ఇంతటి ప్రజాదరణ కలిగిన నేతను కాపాడే బాధ్యత తమదేనన్న విషయాన్ని ఇప్పటికైనా కూటమి సర్కారు గ్రహించాలన్నారు. అధికారంలో ఉండి కూడా ప్రతిపక్ష నేతలకు భద్రత కల్పించకపోవడమన్న చెడు సంప్రదాయానికి వీడ్కోలు పలకాలని ఆయన హితవు పలికారు. ఈ సందర్భంగా నాని తనదైన పంచ్ డైలాగులను సంధించారు.
జగన్ అభిమన్యుడు కాదని చెప్పిన నాని… పద్మవ్యూహాన్ని చేధించిన అర్జునుడే జగన్ అని వ్యాఖ్యానించారు. సింహం సింగిల్ గా వస్తుందంటే… దానర్థం అటు వైపు ఒకరిని, ఇటు వైపు ఇంకొకరిని వెంటేసుకుని ఎన్నికలకు రావడం కాదని, ఒక్క పార్టీగానే ఎన్నికలకు రావడమని అన్నారు. ఎవరినో చూసి ఓటు వేయమని తాము అడగబోమన్న నాని… తమను, తమ పార్టీని చూసే ఓటు వేయాలని కోరే ఏకైక పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates