భార‌తికి భ‌ద్ర‌త‌.. హైకోర్టుకు వైసీపీ?

తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు.. వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ స‌తీమ‌ణి వైఎస్ భార‌తిపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యం వెలుగుచూడ‌గానే.. ప్ర‌భుత్వం వెంట‌నే రియాక్ట్ అయింది. ప‌రిస్థితి చేయి దాట‌కుండా చూసుకునే క్ర‌మంలో స‌ద‌రు కార్య‌క‌ర్త చేబ్రోలు కిర‌ణ్‌ను అరెస్టు చేయించ‌డంతోపాటు.. సోష‌ల్ మీడియా చ‌ట్టం కింద కేసులు కూడా పెట్టించింది.

ఈ వ్య‌వ‌హారం ఇక్క‌డితో ఆగిపోయింద‌ని అనుకుంటున్న స‌మ‌యంలో వైసీపీ వ్యూహ‌త్మ‌కంగా వ్య‌వ‌హ‌రిం చింది. వైఎస్ భార‌తికి భ‌ద్ర‌త క‌ల్పించాల‌ని, ఆమెపై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కిర‌ణ్‌ను ప్ర‌భుత్వం రక్షించే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని పేర్కొంటూ.. వైసీపీ నాయ‌కుడు లేళ్ల అప్పిరెడ్డి ద్వారా ఆ పార్టీ కీల‌క నాయ‌కులు హైకోర్టును ఆశ్ర‌యించే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని.. తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి.

భార‌తిపై ఇప్పుడే కాదు.. గ‌తంలోనూ టీడీపీ నాయ‌కులు అనేక వ్యాఖ్య‌లు చేశార‌ని.. ప్ర‌స్తుతం కిర‌ణ్ చేసిన వ్యాఖ్య‌లు.. అత్యంత దారుణంగా ఉన్నాయ‌ని.. కాబ‌ట్టి అనుచిత వ్యాఖ్య‌లు, సోష‌ల్ మీడియా పోస్టుల‌పై ఉన్న‌త ద‌ర్యాప్తు సంస్థ‌తో విచార‌ణ చేయించ‌డంతోపాటు.. భార‌తికి ప్ర‌భుత్వం వైపు నుంచి భ‌ద్ర‌త క‌ల్పిం చాల‌ని కూడా హైకోర్టును కోర‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇదేస‌మ‌యంలో గ‌తంలో చేసిన వ్యాఖ్య‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేయ‌క‌పోవ‌డంపైనా కోర్టుకు వివ‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో భార‌తికి ర‌క్ష‌ణ‌కు సంబంధించి హైకోర్టు రాష్ట్ర ప్ర‌బుత్వానికి ఆదేశాలు ఇచ్చేలా చూడాల‌ని వైసీపీ నాయ‌కుడు లేళ్ల అప్పిరెడ్డి త‌న పిటిష‌న్‌లో కోరుతున్నారు. ప్ర‌భుత్వం నుంచి 2+2 భ‌ద్ర‌త క‌ల్పించేలా ఆదేశించాల‌ని ఆయ‌న అభ్య‌ర్థించ‌నున్న‌ట్టు తెలిసింది. ఈ పిటిష‌న్‌ను శుక్ర‌వారం హైకోర్టులో దాఖ‌లు చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. మ‌రి దీనిపై ప్ర‌భుత్వం ఎలాంటి కౌంట‌ర్ వేస్తుందో చూడాలి.