అదేదో పెద్దలు చెప్పిన సామెత ‘కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు…’ గత వైసీపీ పాలనలో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’లో అక్రమాలు ముమ్మాటికీ నిజమేనని చెప్పే ఘటన ఒకటి బయటపడింది. అయితే ఈ ఘటన బయటపడిన తీరు, ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిన తీరు ఒకదానికి ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉన్నాయి. ఈ తరహా వ్యవహారం గతంలో ఎప్పుడూ వెలుగు చూడలేదనే చెప్పాలి. శాప్ లో డిప్యూటేషన్ పై విధులు నిర్వర్తిస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ అదికారి నెరపిన వివాహేతర బంధం కాస్తా బయటపడిపోగా.. దానితో పాటే ఆడుదాం ఆంధ్రా అవినీతి కూడా బయటపడిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం అసలు విషయంలోకి వెళితే… కడప జిల్లాకు చెందిన ఓ అధికారి రోడ్లు, భవనాల శాఖలో ఇంజినీర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన పోస్టు కాస్తా… రాష్ట్ర రాజధానికి చేరింది. ఈ క్రమంలో ఆడుదాం ఆంధ్రా పేరిట గత ప్రభుత్వం భారీ కార్యక్రమానికి రూపకల్పన చేయగా.. ఆ కార్యక్రమానికి సంబంధించిన కొనుగోళ్లు, ఏర్పాట్ల టెండర్ల నిర్వహణకు ఈ అధికారి శాప్ కు డిప్యూటేషన్ పై వెళ్లారు. నాడు క్రీడలు, యువజన సర్వీసుల శాఖ వైసీపీ నేత ఆర్కే రోజా చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక శాప్ చైర్మన్ గా నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కొనసాగారు. వీరిద్దరే సదరు కడప అధికారిని ఏరికోరి మరీ శాప్ కు డిప్యూటేషన్ పై తీసుకెళ్లారన్న వాదనలు లేకపోలేదు.
రోజా, బైరెడ్డిల నమ్మకాన్ని వమ్ము చేయని సదరు అధికారి మొత్తం వ్యవహారాన్ని వారు చెప్పినట్టే ముగించారు. టెండర్లలో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నా..చిన్న ఆధారం కూడా బయటపడకుండా చూసుకున్నారు. ఎవరి వాటాలు ఎంత అన్న విషయంపైనా ముందుగా అనుకున్నట్లే ఆయనే పంపిణీ చేశారు. ఇక్కడిదాకా వ్యవహారం అంతా పకడ్బందీగాన జరిగినా… ఆ అధికారి ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళతో నెరపిన వ్యవహారం మాత్రం అనుకోని కారణాలతో బయటపడిపోయింది. అప్పుడే ఆడుదాం ఆంధ్రాలో వచ్చిన సొమ్ములను ఆయన ఏ రీతిన ఖర్చు చేశారన్న వైనం కూడా బయటపడిపోయింది. మహిళతో వివాహేత బంధం, ఆమెతో తన భార్యాబిడ్డల గొడవ, సదరు మహిళ నందిగామ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు, ఆపై పోలీసుల విచారణకు ఆ అధికారి హాజరు కావడం, విచారణలో ఆ అధికారి అన్నీ బటయపెట్టేసిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది.
నందిగామ మహిళతో వివాహేతర బంధం నేపథ్యంలో అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమకు దగ్గరలోని తన కుటుంబం పేరిట ఉన్న భూమిని సదరు అధికారి ఆ మహిళపై రిజిస్ట్రేషన్ చేయించారట. ఈ విషయం తెలుసుకున్న అధికారి భార్యాపిల్లలు నందిగామ వచ్చి సదరు భూమిని తమకు తిరిగి ఇవ్వాలని కోరారట. అందుకు ససేమిరా అన్న ఆ మహిళ ..వారు తనపై దాడికి యత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ అధికారిని స్టేషన్ కు పిలిపించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. కియా దగ్గర భూమితో పాటు ఆ అధికారి ఆ మహిళకు ఏకంగా రూ.12 కోట్ల నగదును బదిలీ చేశారట. ఈ మొత్తాన్ని ఆయన వివిధ ఖాతాల ద్వారా ఆమెకు బదలాయించారట. ఆడుదాం ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి అందిన సొమ్మును ఆయన ఇలా తెలివిగా ఆ మహిళకు తరలించినట్లు సమాచారం. మొత్తంగా ఈ అధికారి అనైతిక బంధం రోజా, బైరెడ్డిల అక్రమ దందాను బయటపెట్టేసిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.