ఎక్కి తొక్కిన ఘనటకు తోపుదుర్తే కారణమట!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన నేపథ్యంలో రేకెత్తిన రాజకీయ మంటలు ఇంకా సద్దుమణగలేదు. రాప్తాడు పర్యటన సందర్భంగా జగన్ కు సరిపడ భద్రత కల్పించలేదని వైసీపీ ఆరోపిస్తుంటే..వైసీపీ నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటూ అధికార కూటమి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో గురువారం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై నియోజకవర్గ పరిధిలోని రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జగన్ పర్యటనలో జరిగిన రచ్చకు తోపుదుర్తే కారణమంటూ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.

రామగిరి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త కురబ లింగమయ్య టీడీపీ నేతల దాడిలో చనిపోయారంటూ వైసీపీ ఆరోపించింది. ఈ దాడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ సీరియస్ గా పరిగణించగా…లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నెల 8న జగన్ పాపిరెడ్డిపల్లి వచ్చారు. ఈ సందర్భంగా గ్రామానికి సమీపంలో పొలాల్లో జగన్ కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేయగా…జగన్ హెలికాప్టర్ దిగంగానే.. అప్పటికే హెలిప్యాడ్ చుట్టూ గుమిగూడిన జనం.. హెలికాప్టర్ ను చుట్టుముట్టారు. తోపులాటలో హెలికాప్టర్ విండ్ షీల్డ్ విరిగిపోగా… ఓ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఫలితంగా హెలికాప్టర్ పనిచేయకపోగా .. జగన్ రోడ్డు మార్గం మీదుగా బెంగళూరు వెళ్లారు.

ఈ ఘటనపై వైసీపీ పోలీసుల తీరును ప్రశ్నించింది. అప్పటికే జగన్ బట్టలూడదీస్తామని వ్యాఖ్యలు చేయడంతో గుర్రుగా ఉన్న పోలీసులు… అసలు ఏం జరిగిందన్న దానిపై విచారణ చేపట్టారు. హెలిప్యాడ్ చుట్టూ ఏర్పాటు చేసిన బారీకేడ్లు సరిగా లేవని, జగన్ భద్రతకు ఇబ్బంది ఏర్పడుతుందని తోపుదుర్దిని అక్కడ విధుల్లోని డీఎస్పీ హెచ్చరించిన విషయం వెలుగు చూసింది. డీఎస్పీ హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో పాటుగా జగన్ వచ్చినంతనే హెలికాప్టర్ వద్దకు దూసుకు వెళ్లాలని వైసీపీ శ్రేణులను తోపుదుర్తి రెచ్చగొట్టారట. తోపులాటలో కానిస్టేబుల్ నరేంద్ర కుమార్ గాయడ్డారు. తాజాగా నరేంద్ర కుమార్ ఫిర్యాదుతో రామగిరి పోలీసులు తోపుదుర్తిపై కేసు నమోదు చేశారు. వెరసి జగన్ కు భద్రత కల్పించలేదంటూ గగ్గోలు పెట్టిన తోపుదుర్తి…జగన్ పర్యటనలో రచ్చకు కారణమయ్యారని తేలడం గమనార్హం.