ముఖ్యమంత్రుల ‘బ్రాండ్స్’పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. “రెండు రూపాయలకే కిలో బియ్యం.. బ్రాండ్ ఎన్టీఆర్‌ది. ఐటీ అంటే.. చంద్రబాబు గుర్తుకు వస్తారు. జలయజ్ఞం అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. మరికొందరు ఉద్యమం తమ బ్రాండ్‌గా ప్రచారం చేసుకుంటారు(కేసీఆర్ గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు). ఈ క్రమంలో నాబ్రాండ్ గురించి కూడా అడుగుతుంటారు. నా బ్రాండ్ ఏంటంటే.. ‘యంగ్ ఇండియా’. ఇదే నా బ్రాండ్” అని రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ సందర్భంగా కేంద్రంపై సునిశిత విమర్శలు చేశారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజలు ఉంటే.. కేవలం కొన్ని మాత్రమే ఒలింపిక్ పతకాలు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. తక్కువ జనాభా ఉన్న దేశాలు మన కంటే ముందున్నాయని.. పదుల సంఖ్యలో ఒలింపిక్ పతకాలను కైవసం చేసుకుంటున్నాయని ఆయన వివరించారు. ఏటా లక్షలాది మంది బీటెక్ చేస్తున్నారని.. కానీ, ఎంత మందికి నాణ్యమైన విద్య అందుతోందని అంటే.. ప్రశ్నార్థకమేనని చెప్పారు.
ప్రతి నియోజకవర్గంలోనూ యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూళ్లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. 25 ఎకరాల్లో రూ.200 కోట్ల ఖర్చుతో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సీఎం వెల్లడించారు. అదేవిధంగా ప్రీ స్కూళ్లను కూడా ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. కాగా.. దీనికి ముందు విద్యార్థులతో కలిసి ఆయన పలు క్రీడలు ఆడారు. చాలా ఉత్సాహంగా.. వారితో కలిసిపోయారు.