జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే సమయంలో తాను ఏదైనా అనుకుంటే… ఎన్ని అవాంతరాలు ఎదురైనా కూడా ఆ పనిని పూర్తి చేయనిది ఇంకో పనిలోకి దిగరు. ఈ విషయంలో చివరకు తన కుటుంబానికి తన అవసరం తక్షణమని తెలిసినా కూడా ఆయన నిర్దేవించుకున్న లక్ష్యం వైపే కదులుతారు. సినిమాల్లో ఉన్నా… ఇప్పుడు రాజకీయాల్లో సాగుతున్నా… పవన్ తీరు అదే. ఆ విషయంలో ఎలాంటి మార్పు లేదు. జనం గురించి నిత్యం ఆలోచించే.. జనానికి ఇచ్చిన మాట మేరకే కదిలే అరుదైన నేతగా పవన్ ను అభివర్ణించుకోక తప్పదు. అలాంటి పవన్ మనస్తత్వాన్ని ఆవిష్కరిస్తూ జనసేన బుధవారం రాత్రి ఓ వీడియోను విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హిట్ సినిమాలను హిట్ బాట ఎక్కించే సూపర్ డూపర్ ట్రైలర్లను మించిన స్థాయిలో ఈ వీడియో ఉందన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇటీవలే పవన్ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు అడవి తల్లి బాట పేరిట ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఉండగానే…పవన్ చిన్నకుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడని తెలిసినా కూడా… బాధను, దు:ఖాన్ని, ఓ తండ్రి ఆవేదనను పంటి బిగువున దాచేసిన పవన్… ఆ కార్యక్రమాన్ని సాంతం ముగించుకున్న తర్వాతే కొడుకును చూసేందుకు బయలుదేరారు. మనసును ద్రవింపజేసే ఈ ఘటనను నేషనల్ మీడియా ఓ రేంజిలో కవరేజీ ఇచ్చింది. నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారం చేసుకునే జనసేన ఈ వీడియోను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ వీడియో అడవి తల్లి బాట కార్యక్రమం ప్రారంభానికి పవన్ బయలుదేరుతున్న దృశ్యాలతో మొదలు కాగా… ఆ కార్యక్రమంలో పవన్ పాలుపంచుకున్న పలు ఆసక్తికర దృశ్యాలు, గిరి జనంతో పవన్ కలగలసిపోయిన తీరును హైలెట్ చేస్తూ వీడియో సాగింది. గిరిజనుల సమస్యలను సావదానంగా వింటూనే వారి సమస్యల పరిష్కారం కోసం తానేం చేయనున్నాను అన్న విషయాలను పవన్ చెబుతున్న దృశ్యాలను కూడా ఈ వీడియోలో హృద్యంగా చిత్రీకరించారు. ఇక అరకు పరిధిలోని కురిడి గిరిజన గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలితో రేపు వస్తానంటూ పవన్ చెప్పిన వ్యాఖ్యలు ఈ వీడియోకు ఆయువుపట్టుగా నిలిచాయి. తొలి రోజు పర్యటన ముగించుకుని వెళుతున్న సందర్భంగా పవన్ ఆ వృద్ధురాలికి ఆ మాట ఇచ్చారు. ఇచ్చిన మాట కోసం పవన్ ఎంతదాకా అయినా వెళతారు కదా. పవన్ కూడా అదే చేశారు. నేషనల్ మీడియా అదే చెప్పింది. దానినే వీడియోలో ప్రొజెక్ట్ చేశారు.
రెండో రోజు పర్యటన ప్రారంభం కాగానే.. తన కుమారుడికి గాయాలయ్యాయని పవన్ తెలిసింది. అయితే కురిడి గ్రామ ప్రజలకు తాను వస్తానని మాట ఇచ్చాను కదా అన్న విషయాన్ని పవన్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా రేపు ఖచ్చితంగా వస్తారా? అంటూ కురిడి వృద్ధురాలు పవన్ ను రెండో సారి కూడా అడిగారు. ఇదే మాటను పదే పదే గుర్తు చేసుకున్న పవన్… తన కుమారుడు ఎలాగూ ఆసుపత్రికి చేరాడు. ప్రాణాపాయం ఏమీ లేదన్న భావనతో రెండో రోజు పర్యటనను కొనసాగించేందుకే నిర్ణయించుకున్నారు. అయితే పార్టీ శ్రేణులతో పాటు అదికారులు కూడా వెంటనే సింగపూర్ వెళ్లాలని పవన్ కు సూచించినా ఆయన ఒప్పుకోలేదు. తన కోసం కురిడి గిరిజనులు ఎదురు చూస్తూ ఉంటారని చెప్పారు. అనుకున్నట్లుగా కురిడి గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మధ్యాహ్నం దాకా గడిపి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి తన సోదరుడు చిరంజీవి తో కలిసి సింగపూర్ వెళ్లారు. ఇవే అంశాలను సదరు వీడియోలో జనసేన హృద్యంగా చిత్రీకరించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates