వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అదికార కూటమి పూర్తిగా కార్నర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. తనకు తానుగా ఏ విషయాన్ని కూడా లేవనెత్తని కూటమి ప్రభుత్వం… జగన్ తనకు తానుగా చేస్తున్న తప్పులను ఆధారం చేసుకుని ఆయనను కార్నర్ చేసే దిశగా వ్యూహాత్మకంగా సాగుతోందని చెప్పక తప్పదు. ఓ విపక్ష నేతగా జగన్ ఘాటు వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణమే. అలా చేయకపోతే వైసీపీ క్షణాల్లో వీక్ అయిపోతుంది. పార్టీని కాపాడుకోవాలంటే… కొన్ని సందర్భాల్లో లైన్ దాటి మాట్లాడక తప్పదన్న భావన చాలా మంది నేతల్లో కనిపిస్తోంది. ఈ తరహా భావన జగన్ లో మరికాస్త ఎక్కువ కనిపిస్తోందని చెప్పాలి. అదే ఇప్పుడు కూటమికి వరంగా మారిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇటీవలే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అయిన సందర్భంగా పోలీసు అదికారులపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలీసులను బట్టలూడదీసి నడిరోడ్డుపై నిలబెడతానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు పోలీసు అదికారుల సంఘం జగన్ తీరును తప్పుబట్టింది. జగన్ వ్యాఖ్యలపై నిరసనలతోనే సరిపెట్టింది. అయితే రాప్తాడు పర్యటనలో బాగంగా జగన్ మరోమారు అవే వ్యాఖ్యలను చేశారు. పోలీసుల బట్టలూడదీసి నిలబెడతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఈ దఫా శ్రీసత్యసాయి జిల్లా పోలీసుల నుంచే కాకుండా పోలీసు అదికారుల సంఘం నుంచి కూడా గట్టి వ్యవతిరేకత ఎదురైంది. జగన్ ను ఇలా వదిలేస్తే.. మరిన్ని సార్లు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారన్న భావనతో ఆయనపై సంఘం ప్రతినిధులు హైకోర్టుకు ఎక్కేశారు. ఓ మాజీ సీఎంగా ఉండి ఇవేం వ్యాఖ్యలంటూ వారు కోర్టుకు ఫిర్యాదు చేశారు.
తాజాగా నరసరావుపేట ఎంపీ, టీడీపీ యువనేత లావు శ్రీకృష్ణదేవరాయలు మరో అడుగు ముందుకేశారు. జగన్ తీరుపై, జగన్ చేసిన వ్యాఖ్యలను నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. జగన్ పదే పదే పోలీసుల ఆత్మ స్థైర్యం దెబ్బతీసేలా ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్రం హోం మంత్రికి ఆయన నేరుగా ఓ లేఖనే రాశారు. ఈ లేఖలో రాయలు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. జగన్ బెయిల్ పై ఉన్న నిందితుడని.. అలాంటి వ్యక్తి నోట పోలీసులను బెదిరిస్తున్నట్లుగా వ్యాఖ్యలు వస్తే.. కేసుల పురోగతి ఏం కావాలని రాయలు ఆందోళన వ్యక్తం చేశారు. తీవ్రమైన ఆర్థిక నేరాల కేసులో నిందితుడిగా ఉన్న జగన్… ప్రభుత్వ వ్యవస్థలను.. అది కూడా కేసుల దర్యాప్తులను పర్యవేక్షించే వ్యవస్థలకు వార్నింగ్ లు ఇచ్చేలా సాగితే… కేసుల్లోని సాక్షులు ప్రభావితం కారా? అని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్ ను ఇప్పటికైనా నిలువరించకపోతే కష్టమేనని సదరు లేఖలో రాయలు అభిప్రాయపడ్డారు.
జగన్ వ్యాఖ్యలపై ఓ వైపు కోర్టుల్లో, మరోవైపు కేంద్ర ప్రభుత్వం వద్ద ఈ తరహా పరిణామాలు వైసీపీ ముందరి కాళ్లకు బంధాలు వేయడమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మిస్టర్ క్లీన్ గా ఉన్న నేతలు… తమ పార్టీలను, పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ఒకింత ఘాటు వ్యాఖ్యలు చేసినా ఫరవా లేదు గానీ… తీవ్రమైన ఆర్థిక నేరాల్లో నిందితుడిగా ఉన్న జగన్ లాంటి నేతల నోట నుంచి ఆ తరహా వ్యాఖ్యలు మాత్రం వారికి చేటు కలిగించేవేనని చెప్పక తప్పదు. ఓపోలీసు అధికారిని.. అది కూడా ఓ మండల స్థాయిలో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్న అధికారిని పేరు ప్రస్తావించి మరీ.. సదరు అదికారిని అమర్యాదకరంగా సంబోధిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని సర్వత్రా నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఈ కొత్త పరిణామాలు వైసీపీకి ఇబ్బందికరమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.