2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్‌కు రాబోతున్నాడు. అమెరికాలో పదేళ్లుగా న్యాయపోరాటం చేస్తూ వచ్చిన రాణా.. తాజాగా అమెరికా సుప్రీం కోర్టు అతని చివరి పిటిషన్‌ను తిరస్కరించడంతో భారత్‌కు అప్పగించనున్నారు. గురువారం మధ్యాహ్నం ఇండియాలో అడుగుపెట్టే అవకాశం ఉంది.
రాణా భారత్‌కు రాగానే ఢిల్లీ పటియాలా హౌస్‌లోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడ న్యాయ అనుమతి తీసుకొని ఎన్‌ఐఏ అధికారులు అతడిని కస్టడీకి తీసుకోనున్నారు. ఇప్పటికే కలెక్ట్ చేసిన ఈమెయిల్స్, కాల్ డేటా, పాస్‌పోర్ట్ రికార్డులు, ఇతర నిందితుల వాంగ్మూలాలతో రాణాను ప్రశ్నించనున్నారు. దర్యాప్తులో కొత్త ఆధారాలు, పాకిస్తాన్‌కు చెందిన ప్రభుత్వ మద్దతు ఉన్నట్టు ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తహావూర్ రాణా 26/11 దాడిలో తీవ్రంగా పాల్గొన్నట్టు ఎన్‌ఐఏ అభియోగ పత్రాల్లో ఉంది. ప్రధాన కుట్రదారుడైన డేవిడ్ హెడ్‌లీకి భారతదేశంలో వీసా ఇప్పించడం, ముంబైలో “ఇమ్మిగ్రెంట్ లా సెంటర్” పేరుతో ఆఫీస్ ఏర్పాటు చేయడం ద్వారా దాడికి అవసరమైన రీకీ చేసే వీలు కల్పించడం అతడి పాత్రలో భాగం. అంతేకాక, పలు నగరాల్లో హెడ్‌లీతో కలిసి ప్రయాణించి చాదార్ హౌజ్‌లు, నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌పై దాడులకు ప్లానింగ్ చేయడంలోనూ అతడి ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు.
అమెరికాలో 2009లో రాణా ఎఫ్‌బీఐ చేత అరెస్టయ్యాడు. కోపెన్‌హాగెన్ లష్కరే తోయిబా కుట్ర కేసులో నేరం నిరూపితమై 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అయితే 26/11 కేసులో నేరం రుజువుకాలేదు. అయినా భారత్ కొనసాగించిన ప్రయత్నాల వల్ల ఆయనను ఇప్పుడైతే భారత్‌కు అప్పగించేందుకు అమెరికా అంగీకరించింది. భారత్ రాణా యొక్క రక్షణ, న్యాయాధికారం, జైలు సదుపాయాలపై అమెరికాకు హామీ ఇచ్చింది.
తహావూర్ రాణా భారత గడ్డపై అడుగుపెట్టడం ద్వారా 26/11 కేసులో మిగిలిన నిందితులపై చర్యలకు మార్గం సుగమం కానుంది. ఇది కేవలం ఒక వ్యక్తిని తేవడం కాదు.. దాడి వెనుక ఉన్న పాకిస్థాన్ మిలిటరీ-ఇంటెలిజెన్స్ మద్దతును బహిర్గతం చేయగల అవకాశంగా అధికారులు భావిస్తున్నారు. దీని ద్వారా ముంబై దాడికి పూర్తి న్యాయసాధన సాధ్యమవుతుందనే ఆశలు మళ్లీ బలపడుతున్నాయి.