జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్ లో సమ్మర్ క్యాంపులో ఉన్న పవన్ కుమారుడు… అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కాళ్లు, చేతులకు కాలిన గాయాలైన విషయం విదితమే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ తో కలిసి క్యాంపులో ఉన్న ఓ బాలిక చనిపోగా… మార్క్ శంకర్ సహా 15 చిన్నారులకు గాయాలయ్యాయి. అయితే వేగంగా స్పందించిన అక్కడి అధికారులు… పిల్లలను సురక్షితంగా మంటల నుంచి కాపాడారు. అయినా అప్పటికే చాలా మంది పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. పవన్ కుమారుడికి కూడా చేతులు, కాళ్లకు గాయాలతో పాటుగా మంటల కారణంగా ఎగసిన పొగను అతడు పీల్చేశాడు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక అధికారులు చిన్నారులను హుటాహుటీన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మార్క్ శంకర్ గాయాలకు ప్రథమ చికిత్స చేశారు. బాలుడు పీల్చిన పొగ నుంచి ఉపశమనం కలిగించేలా ఆక్సిజన్ అందించారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం దాకా మార్క్ శంకర్ కు ఐసీయూలోనే చికిత్స అందించిన వైద్యులు… బుధవారం ఉదయం బాలుడు కాస్తంత కోలుకోవడంతో జనరల్ వార్డుకు షిప్ట్ చేశారు. ఈ సమయానికి హైదరాబాద్ నుంచి సింగపూర్ చేరిన పవన్, ఆయన సోదరుడు చిరంజీవిలు మార్క్ ను చూశారు. బాలుడి ఆరోగ్యం ఓ మోస్తరు మెరుగు పడటంతో వారు ఒకింత సాంత్వన చెందారు.
అయితే ప్రస్తుతం మార్క్ శంకర్ ఎలా ఉన్నారన్న విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా పవన్ కల్యాణ్ స్వయంగా సింగపూర్ వెళ్లిన నేపథ్యంలో మార్క్ ఆరోగ్యం గురించి ఏమైనా అప్ డేట్ వస్తుందేమోనని పవర్ స్టార్ అభిమానులతో పాటుగా జనసేన శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఈ క్రమంలో ఆసుపత్రి బెడ్ పై కూర్చుని ఉన్న మార్క్ ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఈ ఫొటోలో మూతికి ఆక్సిజన్ మాస్క్ వేసుకుని మార్క్ కనిపించాడు. అంతేకాకుడా కుడి చేతికి కాలిర గాయం కావడంతో దానికి వైద్యులు కట్టు కట్టారు. అయితే ఎడమ చేతికి ఏమైనా గాయం అయ్యిందా?.. కాళ్లకు ఏమాత్రం గాయాలయ్యాయి అన్న విషయాలు ఈ ఫొటోలో కనిపించలేదు. ఇక కుడి చేతికి గాయం కనిపిస్తుండగా… మార్క్ ముఖానికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తాను ఆరోగ్యంగానే ఉన్నట్టు , తనకు ఏమీ కాలేదన్నట్లుగా రెండు బొటనవేళ్లతో ఛీర్స్ చెబుతూ మార్క్ కనిపించాడు.