వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మరోసారి రిమాండ్ పొడిగిస్తూ.. విజయవాడ కోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే ఆయన విజయవాడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారంతో ఆయనకు గతంలో విధించిన రిమాండ్ గడువు పూర్తయింది. ఈ నేపథ్యంలో పోలీసులు.. ఆయనను బుధవారం.. విజయవాడలోని సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు.. రిమాండ్ పొడిగించింది.
దీంతో మరో 14 రోజుల వరకు.. వంశీ జైల్లోనే ఉండనున్నారు. కృష్నాజిల్లా గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై 2021-22 మధ్య దాడి జరిగింది. ఈ ఘటనలో కార్లు ధ్వంసమయ్యాయి. అదేవిధంగారూ.లక్షలు విలువ చేసే ఫర్నిచర్ కూడా దగ్ధమైంది. దీనిపై టీడీపీ కార్యకర్త సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు.. వైసీపీ నాయకులు, ముఖ్యంగా వంశీ అనుచరులపై కేసులు నమోదు చేశారు. అయితే.. ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌ను అపహరించి.. బెదిరించారని మరో కేసు నమోదైంది.
దీనిపైనా కేసులు నమోదయ్యాయి. సత్య వర్థన్ కేసులోనే ప్రస్తుతం వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇంత లో గన్నవరం కేసును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఐడీ అధికారులు విచారణ ప్రారంభించారు. తాజాగా ఈ కేసులో గత నెలలో 14 రోజుల రిమాండ్ పడింది. వంశీతోపాటు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన అనుచరులు 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా వీరికి ఈ నెల 23 వరకు రిమాండ్ విధిస్తూ.. సీఐడీ కోర్టు తీర్పు చెప్పింది.