ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కీలక నిర్ణయం తెరమీదికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. రాజధాని అమరావతిని నేరుగా హైదరాబాద్‌తో లింకు చేస్తే.. పెట్టుబడులు, వ్యాపార వేత్తలు రాజధానికి క్యూ కట్టే అవకాశం ఉంటుందని సీఎం చంద్రబాబు తలపోస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘అమరావతి-హైదరాబద్’ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేపట్టాలన్నది చంద్రబాబు ఉద్దేశం.
అయితే.. ఈ ప్రాజెక్టును రాష్ట్రపరిధిలో కాకుండా.. జాతీయస్థాయిలో నిర్మించాలని నిర్ణయించారు. దీనిపై రూపొందించి ప్రాజెక్టు నమూనాకు.. గతంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లినప్పుడు.. చంద్రబాబు వివరించారు. అయితే.. ఇది జరిగి ఆరు మాసాలు కూడా జరిగిపోయింది. అయితే.. తాజాగా దీనిపై భారీ కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టుపై దృష్టి పెట్టిన కేంద్ర హోం శాఖ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేకి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ మేరకు జాతీయ రహదారుల శాఖకు కేంద్ర హోం శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. అంతేకాదు.. ఈ రహదారిలో అటవీ భూమి కూడా ఉండడంతో దీనిని సేకరించేందుకు చర్యలు తీసుకోవాలని.. సంబంధిత శాఖలు సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉంది.
ఇదిజరిగితే.. అమరావతి-హైదరాబాద్ మధ్య నేరుగా కనెక్టివిటీ ఏర్పడడంతోపాటు.. సుమారు 90 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు విజయవాడ లేదా.. గుంటూరు మీదుగా నడికుడి, మిర్యాల గూడల మీదుగా హైదరాబాద్ వెళ్తున్నారు. అయితే.. తాజా గ్రీన్‌ఫీల్డ్ రాకతో.. అమరావతి నుంచి నేరుగా హైదరాబాద్‌కు మార్గం ఏర్పడనుంది. తద్వారా 90 కిలో మీటర్ల దూరం తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.