నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన సొంతింటికి బుధవారం శ్రీకారం చుట్టారు. కుమారుడు నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణీల సమక్షంలో మనవడు నారా దేవాన్ష్ తో కలిసి చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరిలు ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 8.51 గంటలకు మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ కార్యక్రమాన్ని చంద్రబాబు దంపతులు పూర్తి చేశారు.
అమరావతి పరిధిలోని మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే చంద్రబాబు ఫ్యామిలీ ఓటర్లుగా నమోదు అయ్యింది. అయితే ఇప్పటిదాకా వారికి సొంతిల్లు లేదు. ఉండవల్లిలోని కరకట్టను ఆనుకుని ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేశ్ నిర్మించిన ఇంటిలో చంద్రబాబు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటికి కూతవేటు దూరంలోని మరో ఇంటిలో మంత్రి నారా లోకేశ్ నివాసం ఉంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత అమరావతిలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవాలని చంద్రబాబు ఫ్యామిలీ తీర్మానించుకుంది. ఇందుకోసం అమరావతిలోని పాలనా కేంద్రం సచివాలయానికి అత్యంత సమీపంలో సచివాలయం వెనుకాల వెలగపూడి రెవెన్యూ పరిధిలోని ఈ9 రహదారిని ఆనుకుని ఉన్న 5 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు గతేడాది చివరలో కొనుగోలు చేశారు.
తన పేరిట కొనుగోలు చేసిన ఈ భూమిలోనే ఇప్పుడు చంద్రబాబు తన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ 5 ఎకరాల విశాల విస్తీర్ణంలో చంద్రబాబు నివాసంతో పాటుగా పక్కనే అధికారులతో సమావేశం కోసం కాన్ఫరెన్స్ హాలు, పార్కింగ్ ఏరియాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. జీ ప్లస్ వన్ మోడల్ లో ఇంటిని నిర్మించుకుంటున్న చంద్రబాబు.. భవిష్యత్తు అవసరావలకు అనుగుణంగా తన ఇంటిని ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం. కేవలం ఏడాదిన్నరలోనే ఈ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలన్న దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇంటి ప్లాన్ తో పాటు, పరిసరాలను శుభ్రం చేసే పనులు వేగంగా ముగిశాయి. ఇక గురువారం నుంచే చంద్రబాబు ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా సాగనున్నాయి.