పెద్ద కొడుకు పుట్టిన రోజే.. చిన్న కొడుకుకు ప్రమాదం: పవన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు మంగళవారం నిజంగానే ఓ విచిత్ర అనుభవాన్ని మిగిల్చింది. మంగళవారం పవన్ పెద్ద కుమారుడు అకీరా నందన్ జన్మదినం కాగా… అదే రోజు పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అగ్ని ప్రమాదంలో చిక్కుకుని గాయపడ్డారు. ఇదే విషయాన్ని మంగళవారం రాత్రి విశాఖలో మీడియా ముందుకు వచ్చిన పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. కాకతాళీయమో, ఏమో తెలియదు గానీ… నా పెద్ద కొడుకు పుట్టిన రోజే చిన్న కొడుక్కి ప్రమాదం జరిగింది అంటూ పవన్ ఒకింత గద్గద స్వరంతో చెప్పారు. సోమవారం ఇవాళ రాత్రికి తాను సింగపూర్ వెళుతున్నానని, ప్రస్తుతం తన చిన్న కుమారుడు క్షేమంగానే ఉన్నారని, ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని, కొన్ని వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, వాటి రిపోర్టులు వస్తే తప్పించి అగ్ని ప్రమాదంలో తన కుమారుడికి ఏ మేర ఇబ్బంది కలిగిందన్నది తెలుస్తుందని ఆయన చెప్పారు.

అగ్ని ప్రమాదంలో తన కుమారుడు గాయపడ్డాడని తెలిసిన దాని కంటే కూడా ఈ ప్రమాదంలో ఓ బాలిక చనిపోయిన వైనం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని పవన్ చెప్పారు. ఈ ప్రమాదంలో చాలా మంది పిల్లలు గాయపడ్డారన్న పవన్ వారిలో తన కుమారుడు కూడా ఒకరని చెప్పారు. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన బాలిక కుటుంబాన్ని, ఆమె తల్లిదండ్రులను తలచుకుంటుంటే చాలా బాధగా ఉందని పవన్ వ్యాఖ్యానించారు. అగ్ని ప్రమాదంలో ఎగసిన పొగను పీల్చిన కారణంగా తన కుమారుడికి కొంతమేర ఇబ్బంది ఉందని తెలిసిందన్న పవన్… ఈ ప్రభావం తన కుమారుడిపై సుదీర్ఘ కాలం ఉంటుందేమోనన్న భయం ఉందని తెలిపారు. ప్రస్తుతం బ్రాంకోస్కోపి జరుగుతోందని, ఆ నివేదిక వస్తే గానీ ఆ ప్రభావం ఏ మేర ఉంటుందో తెలియదని చెప్పారు. ప్రమాదంలో కాలిన గాయాలు అయితే అయ్యాయని, ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తన సతీమణి అన్నా లెజినోవా షాక్ కు గురైందని, సరిగ్గా మాట్లాడలేకపోతోందని తెలిపారు. 

ఇక తాను సాయంత్రం దాకా అరకు పర్యటనలో గిరిజన ప్రాంతాల పర్యటనలో ఉన్నానని చెప్పిన పవన్… తన కుటుంబ సభ్యులతో ఈ ప్రమాదం గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదని తెలిపారు. తన సోదురుడు చిరంజీవితో కలిసి సింగపూర్ వెళుతున్నారా? అన్న మీడియా ప్రశ్నలకు లేదని పవన్ సమాధానం చెప్పారు. అంతేకాకుండా తన సోదరుడితోనూ ఈ ప్రమాదం గురించి ఇప్పటిదాకా మాట్లాడలేదని తెలిపారు. పిల్లలతోనూ ఇప్పటికీ మాట్లాడలేదన్న పవన్ చెప్పారు. సింగపూర్ లాంటి ప్రాంతాల్లో అది కూడా పాఠశాలల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగించేదేనని పవన్ అభిప్రాయపడ్డారు. తన కుమారుడు ప్రమాదం గురించి తనకు సంఘీభావం తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.