చంద్రబాబు బాటలో సాగుతున్న రేవంత్ రెడ్డి

ప్రజాలకు మెరుగైన పాలనను అందించేందుకు పాలనా సంస్కరణలను రూపొందించి అమలు చేసే విషయంలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిది అందె వేసిన చెయ్యని చెప్పాలి. గతంలో ప్రజల వద్దకే పాలన అంటూ సాగిన చంద్రబాబు… తాజాగా ప్రజల చేతిలోనే పాలన అన్నట్లుగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించారు. మొబైల్ లోని వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలు అందుకునే ఈ తరహా నూతన విధానానికి ఏపీలో మంచి ఆదరణ లభించింది. ప్రజా పాలనలో చంద్రబాబు ప్రవేశపెడుతున్న నూతన విధానాలను ఇతర రాష్ట్రాలు కూడా అవలంభిస్తున్న తీరు చూస్తున్నాం. ఈ తరహాలోనే ఇప్పుడు తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు బాటలోనే సాగేందుకు నిర్ణయించారు. ఏపీలో చంద్రబాబు సర్కారు అమలు చేస్తున్న పలు విధానాలను తెలంగాణలోనూ అమలు చేసే దిశగా రేవంత్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

ఏపీలో భూముల రిజిస్ట్రేషన్లను మరింతగా సరళతరం చేయడంతో పాటుగా రిజిస్ట్రేషన్లను క్షణాల్లో పూర్తి చేసే విధంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. 10 నెలల క్రితం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఏపీ పాలనలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ల శాఖను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా ఇదివరకే చంద్రబాబు మంత్రివర్గ సహచరులతో పాటుగా ఆయా శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖలో కొత్తగా రూపొందిన రిజిస్ట్రేషన్ల స్లాట్ బుకింగ్ విధానాన్ని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ విధానం ద్వారా మనం ఏ రోజు రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నామో..  ఆ రోజు మనకు అనుకూలమైన సమయంలో రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఓ స్లాట్ ను ముందుగానే బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా గంటల తరబడి రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాల వద్ద వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ విధానానికి ఏపీలో భారీ స్పందన వస్తోంది.

తాజాగా ఏపీ తరహాలోనే భూముల రిజిస్ట్రేషన్ నూ స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు కూడా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్లాట్ బుకింగ్ విధానంపై ఓ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 10 నుంచి ఈ నూతన విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు పొంగులేటి తెలిపారు. తొలి దశలో రాష్ట్రంలోని 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ తర్వాత దశల వారీగా రాష్ట్రంలోని అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తామన్నారు. ఈ విధానం ద్వారా కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తి అయిపోతుందని ఆయన తెలిపారు. తొలి దశలో హైదరాబాద్ పరిధిలోని అజంపుర, చిక్కడపల్లి, రంగారెడ్డి జిల్లా పరిధిలోని శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట, సంగారెడ్డి పరిధిలోని సదాశివపేట, మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రామగుండం (పెద్దపల్లి జిల్లా), మహబూబ్ నగర్, జగిత్యాల, నిర్మల్, వరంగల్ పోర్టు, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూలు, ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మంలలో ఈ విధానాన్ని అమలు చేస్తామని ఆయన తెలిపారు.