పవన్ కాన్వాయ్ కారణంగా ఎగ్జామ్ మిస్.. డిప్యూటీ సీఎం రియాక్షన్ ఇదే

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో కొందరు విద్యార్థులు జేఈఈ పరీక్షకు హాజరు కాలేకపోయారన్న వార్తలు రావటం తెలిసిందే. పెందుర్తి పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆపేయటం.. చివరకుసర్వీస్ రోడ్డులోనూ రాకపోకల్ని నిలువరించటంతో నలుగురు విద్యార్థులు పరీక్షకు మిస్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఏపీ డిఫ్యూటీ సీఎం స్పందించారు. విచారణకు ఆదేశించారు. తన కాన్వాయ్ కారణంగా పెందుర్తి విద్యార్థులు జేఈఈ ఎగ్జామ్ హాజరు కాకపోవటంపై విచారణ జరిపి.. తనకు నివేదిక అందించాలని ఆదేశించారు.

నా కాన్వాయ్ కోసం ఎంతసేపు ట్రాఫిక్ నిలిపారు? పరీక్ష కేంద్రం వద్దకు విద్యార్థులు వెళ్లే వేళలో ఆ మార్గంలో ట్రాఫిక్ పరిస్థితేంటి? సర్వీసు రోడ్డులోనూ ట్రాఫిక్ ను నియంత్రించారా? లాంటి అంశాలపై విచారణ జరపాల్సిందిగా విశాఖ పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జేఈఈ మొయిన్స్ పరీక్ష విశాఖ నగరంలోని చినముషిడివాడ ఐయాన్ డిజిటల్ పరీక్ష కేంద్రంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎగ్జామ్ రాసే విద్యార్థులు సోమవారం ఉదయం ఎనిమిదిన్నరకు హాజరు కావాల్సి ఉంటుంది.

అయితే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కారణంగా తాము పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోలేకపోయినట్లుగా నలుగురు విద్యార్థులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఈ వాదనను విశాఖ పోలీసులు తీవ్రంగా ఖండిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ పర్యటన నేపథ్యంలో బీఆర్టీఎస్ సర్వీస్ రోడ్డులోని ఏ ప్రాంతంలోనూ ట్రాఫిక్ నిలిపివేయలేదన్నారు. ట్రాఫిక్ నిలిపివేయటం వల్ల పరీక్షకు సరైన టైంకు చేరుకోలేదని కొందరు అభ్యర్థులు చేసిన ఆరోపణలు తప్పు అంటూ విశాఖపట్నం వెస్ట్ సబ్ డివిజన్ ఏసీపీ ప్రథ్వీతేజ్ వెల్లడించారు. పవన్ కాన్వాయ్ వెళ్లే వేళలోనూ సర్వీస్ రోడ్డలో రాకపోకలు నిలువరించలేదని స్పష్టం చేశారు.