ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ప్రైవేట్ ఆసుపత్రులు విరమించుకున్నాయి. టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీ మేరకే వైద్య సేవలను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఆషా) సోమవారం ఓ కీలక ప్రకటనను విడుదల చేసింది. ఎన్టీఆర్ వైద్య సేవల బిల్లులు గత ఏప్రిల్ నుంచి భారీగా పేరుకుపోయాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించలేమని ఆషా దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చేసింది. అంతేకాకుండా ఈ నిర్ణయాన్ని ఆషా పాక్షికంగా అమలు చేసింది కూడా.
ఇలాంటి క్రమంలో ఆషాకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. నేరుగా సీఎం నుంచే పిలుపు రావడంతో సోమవారం ఆషా అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్, కార్యదర్శి అవినాశ్, ఇతర ముఖ్యులు నాగమల్లేశ్వరరావు, ఆయుష్ రమేశ్ లు అమరావతిలోని సచివాలయానికి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో వారు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపు ఎంత ప్రాదాన్యం కలిగిన అంశమో చంద్రబాబు వారికి వివరించారు. అదే సమయంలో నెలల తరబడి బిల్లుల చెల్లింపు లేకుండా సేవల కొనసాగింపు కూడా కష్టమేనని కూడా చంద్రబాబు అన్నారు. అయితే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కూడా గమనించాలని ఆయన వారిని కోరారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా… బకాయిల్లో ఓ రూ.500 కోట్లను వీలయినంత త్వరలో విడుదల చేస్తామని చంద్రబాబు ఆషా సభ్యులకు హామీ ఇచ్చారు. చంద్రబాబు నుంచి ఈ హామీ వచ్చినంతనే ఆషా అక్కడికక్కడే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఎన్టీఆర్ వైద్య సేవల నిలిపివేతను ఉపసంహరించుకోవాలని ఆ సంఘం తీర్మానించింది. చంద్రబాబు కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ఆషా కార్యదర్శి అక్కడే మీడియాకు ఈ విషయాన్నివెల్లడించారు. కేవలం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవలను కొనసాగించేందుకు నిర్ణయించామని ఆయన వెల్లడించారు. వెరసి ఒక్క మాటతో చంద్రబాబు… ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కొనసాగింపునకు మార్గం సుగమం చేశారు.