ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం చూసి తాను కరిగిపోయానని చెప్పారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యంలో పర్యటించిన ఆయన.. అడవి తల్లిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయ నృత్యాలు, వారి సంస్కృతిని పరిశీలించారు. అదేసమయంలో అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ(ఒకప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతం)లో పలు రోడ్ల నిర్మాణానికి శంకు స్థాపన చేశారు.
ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం గిరిజనులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఔదార్యం చూసి తాను కరిగిపోయానని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో అడవి బిడ్డలు.. ఏ చిన్న సమస్య వచ్చినా.. డోలీ కట్టుకుని నగరాలకు వస్తున్నారు. నేను అనేక సందర్భాల్లో ఈ వార్తలు చూశా. చలించిపోయా. ఏదైనా చేయాలని సంకల్పించా. కానీ.. ఏం చేయాలో అర్ధం కాలేదు. అధికారంలోకి వచ్చాక.. ఈ సమస్యపై లోతుగా చర్చించా. రహదారుల నిర్మాణం ఒక్కటే మార్గమని.. నిర్ణయించుకున్నా. ఆ వెంటనే చంద్రబాబును కలిసి.. సమస్య చెప్పా అని తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబునుకోరినట్టు పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే.. తన విజ్ఞప్తిని విన్న చంద్రబాబు.. క్షణం కూడా ఆలోచించకుండా.. వెంటనే 49 కోట్ల రూపాయలు మంజూరు చేశారని తెలిపారు. 24 గంటల్లో అవి ఖాతాల్లోకి పడ్డాయన్నారు. ఆయన ఔదార్యాన్ని చూసి తన మనసు కరిగిపోయిందన్నారు. గిరిజనులకు భౌతిక మైన విద్య లేకపోవచ్చని.. కానీ, వారు నిపుణులని పవన్ కల్యాణ్ కొనియాడారు. అనేక రూపాల్లో వారి కళలు ప్రాశస్త్యం పొందుతున్నాయన్నారు. అయితే.. వారికి కొంత సాయం చేస్తే..మరింత పుంజుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
ఇప్పుడు తాను చేస్తున్న ప్రయత్నం కూడా.. అదేనని పవన్ చెప్పుకొచ్చారు. గిరిజన ప్రాంతంలో రోడ్లు బాగుండాలని.. ఆ దిశగా తాను ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. వైసీపీ హయాంలో రహదారులు గోతుల మయంగా ఉండేవని.. ఐదేళ్లలో రోడ్లకు 92 కోట్లే ఖర్చు చేశారని.. దీంతో ప్రజలు నానా తిప్పలు పడ్డారని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. తాము కేవలం ఏడాదిలోపే 1,500 కోట్లు ఖర్చు పెట్టి రహదారులను నిర్మిస్తున్నట్టు వివరించారు.