వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో పాటుగా ఆ పార్టీ పేరు చెప్పుకుని చాలా మంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చాక ఆ అక్రమాలపై వరుసగా కేసులు నమోదు కాగా… ఆ కేసుల నుంచి, కనీసం అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీకి చెందిన చాలా మంది కీలక నేతలు వరుసగా కోర్టులకు క్యూ కట్టారు. చాలా మంది ముందస్తు బెయిళ్లు తెచ్చుకున్నారు. ఆ జాబితాలోకి ఇప్పుడు వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ, లోక్ సభలో ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి కూడా చేరిపోయారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా మిథున్ రెడ్డిని అరెస్టు చేయరాదంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం ఏపీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టిన వైసీపీ అధికారంలోకి రాగానే… రాష్ట్రంలో మద్యం పాలసీని పూర్తిగా మార్చేశారు. అప్పటిదాకా ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరిగితే… వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం విక్రయాలు జరిగాయి. ఈ క్రమంలో భారీ ఎత్తున మద్యం కుంభకోణం జరిగిందని కూటమి సర్కారు ఆరోపిస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీఐడీ అధికారులు ఏకంగా కేసు కూడా నమోదు చేశారు. నాటి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్దికి ఐటీ సలహాదారుగా వ్యవహరించిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఈ మొత్తం వ్యవహారాన్ని మిథున్ రెడ్డి కనుసన్నల్లో నిర్వహించారని ప్రాథమిక విచారణలో తేలింది. విచారణకు రావాలంటూ కసిరెడ్డికి నోటీసులు జారీ చేసినా… ఆయన పెద్దగా స్పందించనే లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనన్న భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.
సీఐడీ నమోదు చేసిన కేసులో అసలు మిథున్ రెడ్డి పేరే లేదని, అలాంటప్పుడు మిథున్ రెడ్డిని ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ను తిరస్కరించింది. దీంతో మిథున్ ఆఖరి అస్త్రంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వ ప్రకటనలు, పోలీసుల నుంచి వస్తున్న లీకులను బట్టి చూస్తుంటే… తనను అరెస్టు చేయడానికి రంగం సిద్ధం అయ్యిందని ఆరోపించిన మిథున్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు… మిథున్ రెడ్డి వాదనను పరిగణనలోకి తీసుకుని ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా మిథున్ రెడ్డిని అరెస్టు చేయరాదంటూ సుప్రీంకోర్టు ఏపీ సీఐడీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలా ఉంటే… మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఆయన అరెస్టుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారన్న వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి ఢిల్లీలో ఉండగా… ఆయనను అక్కడే అదుపులోకి తీసుకునేందుకు ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీకి వెళ్లారని కూడా వార్తలు వినిపించాయి. ఫలితంగా మిథున్ రెడ్డి ఏ క్షణమైనా అరెస్టు అయ్యే అవకాశం లేకపోలేదన్న వాదనలూ వినిపించాయి. ఈ వార్తలను ప్రత్యేకించి వైసీపీ సోషల్ మీడియానే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. అయితే మిథున్ రెడ్డిని శని, ఆదివారాల్లో అసలు పోలీసులు అరెస్టే చేయలేదు. తాజాగా సుప్రీంకోర్టు మిథున్ రెడ్గికి ముందస్తు బెయిల్ ఇవ్వడంతో ఆయన అరెస్టు ఇప్పటికైతే ఉండదనే చెప్పాలి. మరి సింపతీ కోసమే ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీ వెళ్లారని, మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని వైసీపీ సోషల్ మీడియా వార్తలను ప్రచారం చేసినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.