కమ్యూనిస్టు పార్టీ సీపీఎంకు కొత్త సారథి వచ్చారు. తమిళనాడులో జరుగుతున్న 24వ అఖిల భారత మహా సభల వేదికగా.. కొత్త నాయకుడిని ఎన్నుకుంటూ కమ్యూనిస్టులు తీర్మానం చేశారు. సుదీర్ఘకాలంగా పార్టీతో అనుబంధంతోపాటు.. పార్టీకి హోల్ టైమర్‌గా వ్యవహరిస్తున్న ఎంఏ బేబీకి ఈ దఫా సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి దక్కింది. ఈ మేరకు ఆయన పేరును సీపీఎం సమన్వయ కర్త, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రకాశ్ కారత్ ప్రతిపాదించారు. దీనిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో సీపీఎంకు గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ప్రధాన కార్యదర్శి పోస్టు భర్తీ అయింది.
ఎవరీ బేబీ..?
ఎంఏ బేబీ అంటే పురుష నాయకుడు. సహజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బేబీ అంటే.. మహిళ అనే కోణంలోనే వాడినా.. కేరళకు చెందిన బేబీ.. సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు. ఈయన కేరళలలో బలమైన నాయకుడు కూడా. గతంలో ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. నిజాయితీతో కూడిన నాయకుడిగా..కుటుంబం యావత్తు పార్టీకే పనిచేస్తున్న నేపథ్యంలో బేబీ పేరును కారత్ ప్రస్తావించారు. అయితే.. దీనికి ముందు సుదీర్ఘ కసరత్తు జరిగింది. ఆయన పేరును సీపీఎం ఏకగ్రీవంగా ఆమోదించిన దరిమిలా.. ఆయనను ప్రకటించారు.
బీవీ రాఘవులు అవుట్!?
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా.. కొన్నాళ్ల కిందటి వరకు.. తెలుగు రాష్ట్రాలకు చెందిన సీతారాం ఏచూరి ఉన్నారు. అయితే.. హృధయ సంబంధిత సమస్యతో ఆయన ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగానే ఉంది. అనేక మంది పేర్లు తెరమీదికి వచ్చాయి. ఈ క్రమంలో తెలుగు వాడైన బీవీ రాఘవులుకు కూడా అవకాశం దక్కుతుందని అందరూ అనుకున్నారు. అయితే.. సామాజిక వర్గం ప్రకారం.. ఆయన ఉన్నత తరగతికి చెందిన నాయకుడు కావడం, ఈ దఫా మైనారిటీ వర్గాలకు(వక్ఫ్‌కు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో) ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయించడంతో బేబీకి అవకాశం చిక్కింది.
కేబినెట్ హోదా!
పార్టీపరంగా చూసుకుంటే.. సీపీఎం ప్రధాన కార్యదర్శికి కేబినెట్ హోదాతో కూడిన ర్యాంకు ఉంటుంది. అది అనధికారికమే అయినా.. పార్టీ ఆమేరకు చెల్లింపులు చేస్తుంది. విమాన చార్జీలు, రవాణా చార్జీలు సహా .. దేశవ్యాప్తంగా కార్యదర్శి తిరిగేందుకు అవకాశం ఉంటుంది. ఈ చార్జీలను పార్టీనే భరిస్తుంది. అదేవిధంగా ఆయన పార్టీకి చీఫ్‌గా ఉంటూ.. తీసుకునే నిర్ణయాలకు బలమైన మద్దతు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం చర్చలకు ఆహ్వానిస్తే.. ఆయనే స్వయంగా హాజరు అయ్యే అవకాశంపొలిట్ బ్యూరో.. ఇలా.. అన్ని విధాలా ప్రధాన కార్యదర్శి పోస్టు అత్యంత కీలకమనే చెప్పాలి.