అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి పగ్గాలు చేపట్టిన తర్వాత.. ప్రపంచ దేశాల దిగుమతులపై భారీఎత్తున సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్న విషయం తెలిసిందే. తన-మన అన్న తేడా లేకుండా.. అన్ని దేశాలపైనా ఆయన సుంకాల కొరడా ఝళి పిస్తున్నారు. దీంతో భారత దేశంపైనా భారీఎత్తున ప్రభావం పడుతోంది. కానీ.. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్న వాదన కూడా ఉంది. అమెరికాతో చర్చలు జరుపుతామని చెబుతున్నా.. అవి సాకారం కావడం లేదు. మరోవైపు.. ఈ సుంకాల కారణంగా ఏపీపై తీవ్ర ప్రభావం పడుతోంది.
గత రెండు రోజుల్లోనే అమెరికా పెంచిన సుంకాల కారణంగా.. రొయ్యల రంగం తీవ్రంగా దెబ్బతింది. సముద్ర ఉత్పత్తులకు కూడా గిరాకీ పడిపోయింది. ఏపీ నుంచి రొయ్యలు, పీతలు, ఇతర సముద్ర ఉత్పత్తులు విరివిగా అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఈ క్రమంలో అమెరికా పెంచిన టారిఫ్ కారణంగా.. ఏపీ రొయ్యల సాగు రంగం తీవ్రంగా దెబ్బతింది. దీనిపై మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోకస్ చేసింది. ప్రస్తుతం అమెరికా 27 శాతం మేరకు రొయ్యలపై సుంకాలు విధించింది. దీనిని గమనించిన చంద్రబాబు కేంద్రానికి ఆదివారం ఓ లేఖ రాశారు. దీనిలో ఆయన అమెరికా సుంకాలపై జోక్యం చేసుకోవాలని కోరారు.
ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో.. ఏపీలో ఎంత మంది మత్స్యకారులు ఆక్వా సాగుపై ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని వివరించారు. అంతేకాదు.. అమెరికా పెంచిన సుంకాలు.. తద్వారా ఏర్పడుతున్న నష్టం వంటివాటిని కూడా పేర్కొన్నారు. ఏపీ ఆక్వారంగాన్ని ఆదుకోవాలని, అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా అగ్రరాజ్యంతో కేంద్రం చర్చలు జరపాలని ఆయన విన్నవించారు.
రాష్ట్ర తలసరి ఆదాయంలో ఆక్వా రంగం కీలకంగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం లో చిక్కుకునే ప్రమాదం ఏర్పడిందని.. దీని నుంచి బయట పడేయకపోతే.. లక్షలాది మంది ఉపా ధి కోల్పోయే ప్రమాదం ఉందని వివరించారు. ఆక్వాపై 27 శాతం మేరకు(100కు 27 రూపాయలు) సుంకాలు విధించడం ద్వారా ఆక్వా కోలుకోలేని విధంగా దెబ్బతింటుందన్నారు. అధిక సుంకాల వల్ల ఏపీ ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఆక్వా సాగు ఎలా ఉన్నా.. వీటి ఉత్పత్తులను నిల్వ చేసుకునే సదుపాయాలు పెద్దగా లేవని.. వీటికి కూడా కేంద్రం సహకరించాలని ఆయన విన్నవించారు.