ఏపీ వాణిజ్య రాజధాని విశాఖపట్నంలో సెంటు భూమి కూడా అత్యంత విలువైనదే. అలాంటి నగరంలో ఇప్పుడు 15.17 ఎకరాల భూమిపై పెద్ద వివాదమే నడుస్తోంది. ఈ భూమిని తెలుగు నేల ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2003లో అప్పటి టీడీపీ సర్కారు రామానాయుడు స్టూడియో నిర్మాణం కోసం కేటాయించింది. స్టూడియో నిర్వాహకులుగా ఉన్న సురేశ్ ప్రొడక్షన్స్ కు నాడు టీడీపీ సర్కారు 34.44 ఎకరాల భూమిని కేటాయించింది. అక్కడ సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యవహారాల కోసం స్టూడియోను నిర్మించాలన్నది నాటి ఇరు వర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. ఈ ఒప్పందం మేరకు సురేశ్ ప్రొడక్షన్స్ అందులోని కొంత భాగంలో స్టూడియోను నిర్మించి..మిగిలిన స్థలాన్ని అలాగే ఖాళీగా ఉంచేసింది. ఈ ఖాళీగా ఉన్న భూములే ఇప్పుడు వివాదానికి కారణంగా నిలుస్తున్నాయి.
ఈ భూములకు సంబంధించి మొన్నటి ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములను సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను బెదిరించి… ఖాళీగా ఉన్న భూములను కాజేసేందుకు యత్నిస్తున్నారన్న దిశగా జరిగిన ఈ చర్చలో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసలు స్టూడియో నిర్మాణం కోసం ఇచ్చిన ఈ భూములను లే అవుట్లుగా ఎందుకు మారుస్తున్నారంటూ తొలుత సురేశ్ ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేయాలని తీర్మానించింది. ఈ నోటీసులకు సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందన్న దానిపై తదుపరి నిర్ణయం ఉంటుందని కూడా తెలిపింది. అంటే.. ఈ భూములను లే అవుట్లుగా వేయలేదని, ఆ భూములు ఇంకా తమ అధీనంలోనే ఉన్నాయని, స్టూడియోను విస్తరించే దిశగా ఆ భూములను వినియోగిస్తామని సురేశ్ ప్రొడక్షన్స్ సమాధానం ఇస్తే సరేసరి.
అలా కాకుండా ఇంకే రకమైన సమాధానం సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి వచ్చినా కూడా తక్షణమే 15.17 ఎకరాల భూములను వెనక్కు తీసుకోవాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ నుంచి ఆదేశాలు అందుకున్న విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్.. సురేశ్ ప్రొడక్షన్స్ కు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ నోటీసులు సురేశ్ ప్రొడక్షన్స్ కు చేరనున్నట్లుగా సమాచారం. సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి సమాధానం వచ్చేందుకు ఓ నిర్ణీత గడువును విధించి మరీ నోటీసులు జారీ చేయనున్నారు. ఆ నిర్దేశిత సమయంలోగా సురేశ్ ప్రొడక్షన్స్ నుంచి ప్రభుత్వానికి సమాధానం రావాల్సి ఉంది. అలా కాకుండా గడువు ముగిసినా… గడువులోగానే ప్రభుత్వానికి అసంతృప్తికర సమాధానం వచ్చినా… మరుక్షణమే 15.17 ఎకరాల భూములు ప్రభుత్వానికి స్వాధీనం అయిపోతాయి. ఈ లెక్కన ఇప్పటికీ ఆ భూములు సురేశ్ ప్రొడక్షన్స్ ఆధీనంలో ఉన్నా… వాటిని కాపాడుకునేందుకు ఆ సంస్థ ఎలాంటి చర్యలు చేపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.