లెక్కంటే లెక్కే.. బాబు మార్కు పదవుల భర్తీ

నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా అభాసుపాలు కాకుండా ఉండాలంటే… అందుబాటులో ఉన్న లెక్కలను ఆధారం చేసుకుని ముందుకు సాగాల్సిందే. ఈ ఈక్వేషన్ ను టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పక్కాగానే అమలు చేస్తున్నట్లు ఉన్నారు. ఏపీలో అదికారంలో ఉన్న కూటమిలో టీడీపీతో పాటుగా జనసేన, బీజేపీలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూడు పార్టీలకు ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యను ఆధారం చేసుకునే చంద్రబాబు…అందుబాటులోకి వస్తున్న పదవులను పంపిణీ చేస్తున్నారు.

ఏపీలో వ్యవసాయ సహకార మార్కెట్ కమిటీలన్నీ దాదాపుగా ఖాళీగానే ఉన్నాయి. ఇటీవలే కొన్నింటికి పాలక వర్గాలను ప్రకటించిన చంద్రబాబు… తాజాగా శుక్రవారం 38 మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను ప్రకటించారు. వీటిని కూటమి పార్టీలకు… వాటి బలాబబాలను బేరీజు వేసుకుని మరీ ఆయా దామాషా పద్ధతిననే భర్తీ చేశారు. ఇందులో అత్యధిక ఎమ్మెల్యేలను కలిగిన టీడీపీకి 31 స్థానాలను కేటాయించిన చంద్రబాబు.. డబుల్ డిజిట్ ఎమ్మెల్యేలను కలిగిన జనసేనకు 6 స్థానాలు, సింగిల్ డిజిట్ సంఖ్యలో ఎమ్మెల్యేలను కలిగిన బీజేపీకి సింగిల్ స్థానాన్ని కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్ఱభుత్వం ఈ నియామకాలకు సంబందించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

ఏపీ అసెంబ్లీలో మొత్తం 175 సీట్లుండగా.. వాటిలో వైసీపీ గెలిచిన 11 సీట్లను మినహాయిస్తే… కూటమికున్న సభ్యుల సంఖ్య 164. ఇందులో బీజేపీకి 8 సీట్లుండగా… జనసేనకు 21 సీట్లున్నాయి. ఇక మిగిలిన 135 సీట్లు టీడీపీవే. ఈ కారణంగానే అటు కేబినెట్ లో అయినా… ఇటీవలే భర్తీ అయిన రాజ్యసభ, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీట్లు అయినా… ఈ దామాషా పద్దతి ప్రకారమే పంచుకుంటూ కూటమి పార్టీలు సాగుతున్నాయి. తాజాగా ఈ పద్దతిని స్థానిక సంస్థలకు కూడా చంద్రబాబు వర్తింపజేస్తూ కూటమి పార్టీల మధ్య ఎలాంటి పొరపొచ్చాలు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.