పెద్ద నేత‌ల‌కు ఎస‌రు.. రంగంలోకి జ‌గ‌న్ ..!

వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ఓ మోస్త‌రు నేత‌ల‌ను మాత్ర‌మే టార్గెట్ చేసిన కూట‌మి ప్ర‌భుత్వం.. ఇప్పుడు పెద్ద త‌ల‌కాయ‌ల జోలికి వెళ్లింది. వీరిలో మాజీ మంత్రి కాకాని గోవ‌ర్ధ‌న్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే. నెల్లూరులోని రుస్తు ప్రాంతంలో ఉన్న క్వార్ట్జ్ గ‌నుల‌ను అక్ర‌మంగా త‌వ్వి 250 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు పోగేసుకున్నార‌న్న‌ది కాకానిపై ఉన్న ప్ర‌ధాన అభియోగం. అయితే.. ఈ కేసులో ముంద‌స్తు బెయిల్ తెచ్చుకునే అవ‌కాశం ఉంది.

కానీ, ఇక్క‌డే కూట‌మి స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. క్వార్ట్జ్ గ‌నులు ఉన్న ప్రాంతంలో నివ‌సిస్తున్న ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌ను కాకాని బెదిరించార‌ని.. కులం పేరుతో దూషించార‌ని పేర్కొంటూ.. మ‌రో కేసు న‌మోదు చేసింది. ఇది గ‌నుల కేసు కంటే కూడా.. తీవ్రంగా మారింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న పెట్టుకున్న ముంద‌స్తు బెయిల్‌పై హైకోర్టు విముఖ‌త వ్య‌క్తం చేసింది. ఇక‌, మ‌ద్యం కుంభ‌కోణంలో అప్ప‌టి ఎండీ వాసుదేవ‌రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంటు ఆధారంగా ఎంపీ మిథున్ రెడ్డి పేరును ఈ కేసులో చేర్చార‌ని ఆయ‌నే స్వ‌యం చెబుతున్నారు.

ఈ క్రమంలోనే త‌న‌ను అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని.. కాబ‌ట్టిముంద‌స్తు బెయిల్ ఇవ్వాల‌ని కోరారు. కానీ, దీనిపైనా హైకోర్టు వెన‌క్కి త‌గ్గింది. ఫ‌లితంగా ఈ ఇద్ద‌రు నాయ‌కుల‌ను ఎప్పుడైనా అరెస్టు చేసేఅవ‌కాశం ఉంద‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే.. వీరిద్ద‌రూ కూడా.. జ‌గ‌న్‌కు అత్యంత సన్నిహితులు.. కావాల్సిన వారు కావ‌డంతో పాటు.. రెడ్డి సామాజిక వ‌ర్గంలో బ‌ల‌మైన నాయ‌కులు కూడా. దీంతో ఇప్పుడు వీరిని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం.. బాధ్య‌త రెండూ కూడా… జ‌గ‌న్‌కు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌.. వీరిని అరెస్టు కాకుండా చూసేందుకు త‌నే స్వ‌యంగా రంగంలోకి దిగుతున్నార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎంత ఖ‌ర్చ‌యినా ఫ‌ర్వాలేదు.. మంచి లాయ‌ర్ల‌ను నియ‌మించాల‌ని ఆయన పార్టీ వ‌ర్గాల‌కు స‌మాచారం అందించారు. హైకోర్టులో బెయిల్ రాని ప‌క్షంలో హుటాహుటిన సుప్రీంకోర్టు కు వెళ్లాల‌ని కూడా సూచించారు. మ‌రోవైపు.. త‌ను కూడా .. సుప్రీంకోర్టు లాయ‌ర్ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. ఇత‌ర నేత‌ల మాట ఎలా ఉన్నా.. రెడ్డి వ‌ర్గానికి చెందిన వారిని కాపాడుకోక‌పోతే.. ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ఆయ‌న గ్ర‌హించారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.