దేశవ్యాప్తంగా చాలా కాలంగా చర్చనీయాంశంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటులో ఆమోద ముద్ర పడి పోయింది. పార్లమెంటులోని దిగువ సభ లోక్ సభ బుధవారమే ఈ బిల్లుకు ఆమోదం తెలపగా…ఎగువ సభ అయిన రాజ్యసభ గురువారం రాత్రి ఆమోదం తెలిపింది. గురువారం అర్థరాత్రి దాకా రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ కొన సాగింది. అర్థ రాత్రి దాటిన తర్వాత బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది సభ్యులు ఓటేయగా… వ్యతిరేకంగా 95 మంది ఓటేశారు. వెరసి వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపినట్లు సభాధ్యక్షుడి స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ కడ్ ప్రకటించారు.
పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపితే…అది చట్టంగా మారిపోతుంది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లబించడం కూడా లాంఛనమేనని చెప్పక తప్పదు. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రపతి ఆయా బిల్లులకు ఆమోదం విషయంలో కొంతమేర ఆలస్యం చేసే అవకాశాలున్నా… ప్రస్తుతం అయితే ఆ తరహా పరిస్థితి లేదనే చెప్పాలి. ఆయా వర్గాల వినతులను పరిగణనలోకి తీసుకోవడమో…లేదంటే ఆయా వర్గాలు బిల్లుపై తాము కోర్టుల్లో పోరాటం చేస్తామనో రాష్ట్రపతికి చెప్పి… బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేయకుండా నిలువరించే అవకాశాలు లేకపోలేదు. అయితే దేశంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అలాంటి అవకాశమే లేదని చెప్పక తప్పదు.
ఇదిలా ఉంటే… పెద్దల సభగా పరిగణిస్తున్న రాజ్యసభలో వక్ఫ్ సవరణ బిల్లుపై సుదీర్ఘంగా జరిగిన చర్చ వాడీవేడీగా సాగింది. అంతేకాకుండా లోక్ సభకు ధీటుగా సాగిన ఈ చర్చ గురువారం అర్థరాత్రి దాటిపోయేదాకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ బిల్లుకు ఉన్న ప్రాధాన్యం రీత్యా రాజ్యసభ చైర్మన్, అదికార ఎన్డీఏ కూడా విపక్షాలు కోరినంత సేపు చర్చకు అంగీకరించాయి. వెరసి ఈ బిల్లుకు ఆమోదం విషయంలో ఎన్డీఏ సర్కారు విపక్షాల నోళ్లను నొక్కిందన్న వాదన అయితే వినిపించలేదు. విపక్షాలు తమ ఆందోళనలన్నింటినీ వెల్లడించే అవకాశం ఇవ్వడంతో పాటుగా విపక్షాలు లేవనెత్తిన అన్ని రకాల అంశాలకు సమగ్రంగా సమాధానాలు ఇచ్చిన తర్వాతే ఎన్డీఏ ఓటింగ్ కు వెళ్లింది. ఓటింగ్ లోనూ బిల్లుకు అనుకూలంగా మెజారిటీ ఓట్లు పడటంతో ఎన్డీఏ అనుకున్నట్లుగానే వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates