ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. గతంలో ఫ్యాక్షన్ కక్షలతో నిత్యం దాడులు, హత్యలతో ఆ నియోజకవర్గ పరిధిల రక్తమోడింది. అయితే గత కొంతకాలంగా అక్కడ అసలు ఫ్యాక్షన్ అనే పదమే వినిపించడం లేదు. నాడు టీడీపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయం జరిగితే.. ఇప్పుడు టీడీపీ, వైసీపీల మధ్య రాజకీయం నడుస్తోంది. నాడు టీడీపీని కాంగ్రెస్ పార్టీ ఓడించిందే లేదు. అయితే ఇప్పుడు అక్కడ వైసీపీ కూడా విజయం సాధించింది. 2019 నుంచి 2024 వరకు రాప్తాడుకు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 ఎన్నికల్లోనూ రాప్తాడులో పెద్దగా గొడవలు జరిగిన దాఖలానే లేదని చెప్పాలి. ప్రశాంతంగా జరిగిన ఆ ఎన్నికల్లో తిరిగి టీడీపీ విజయ కేతనం ఎగురవేసింది. ఇదంతా గతం అయితే… ఇప్పుడు రాప్తాడు పర్యటనకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వస్తున్నారన్న విషయం ఖరారు అయిన మరుక్షణమే రాప్తాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల జరిగిన రామగిరి మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక సందర్భంగా వైసీపీ, టీడీపీల మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవల్లో మండలంలోని పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్య అనే వైసీపీ కార్యకర్త మరణించారు. లింగమయ్య మృతి కుటుంబ తగాదాల వల్ల జరిగిందని టీడీపీ చెబుతుంటే… టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత దగ్గరి బంధువులు జరిపిన దాడిలోనే లింగమయ్య చనిపోయారని వైసీపీ వాదిస్తోంది. ఇదే వాదనతో లింగమయ్య కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయగా… ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. ఇలాంటి సమయంలో తాను రాప్తాడు వస్తున్నానని, మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శిస్తానని జగన్ రెండు రోజుల క్రితం ప్రకటించారు. జగన్ నుంచి ప్రకటన వచ్చినంతనే రాప్తాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులకు వైసీపీకి చెందిన తోపుదుర్తి చంద్రశేఖరరెడ్డి నాందీ పలికారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
జగన్ పర్యటన గురించి ప్రకటించేందుకు బుధవారం మీడియా ముందుకు వచ్చిన చంద్రశేఖరరెడ్డి… జగన్ టూర్ వరకే పరిమితమై ఉంటే సరిపోయేదేమో. అయితే టీడీపీ శ్రేణులను, ప్రత్యేకించి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి పరిటాల సునీతను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఎప్పుడో మరణించి సునీత భర్త పరిటాల రవీంద్ర పేరును తీసుకువచ్చిన ఆయన… తాను దుర్మార్గుడిని అయితే మరి నీ భర్త ఎలాంటి వారు అంటూ ఆయన ప్రశ్నించారు. హత్యా రాజకీయాలను పరిటాల ఫ్యామిలీ ఇంకా వీడలేదంటూ ఆయన ఆరోపించారు.
చంద్రశేఖరరెడ్డి ఆరోపణలతో పరిటాల సునీత అనివార్యంగానే గురువారం మీడియా ముందుకు వచ్చారని చెప్పాలి. పరిటాల రవి హత్య గురించి ఆమె ప్రస్తావించారు. తన భర్త హత్యలో జగన్ కూ పాత్ర ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ నేతల దాడుల్లో మరణించారంటూ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చే జగన్… తోపుదుర్తి ఫ్యామిలీ దాడుల్లో చనిపోయిన టీడీపీ నేతల కుటుంబాలను కూడా పరామర్భించాలని ఆమె డిమాండ్ చేశారు. వెరసి రాప్తాడులో ఇప్పుడు జగన్ పర్యటన అగ్గిని రాజేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.