అమరావతీ ఊపిరి పీల్చుకో.. డబ్బులొచ్చేశాయి

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చిదిమేయాలని వైసీపీ అదినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేయని యత్నమంటూ లేదు. నాడు టీడీపీ సర్కారు ఎంపిక చేసిన అమరావతి తనకూ సమ్మతమేనని నమ్మ బలికిన జగన్… ఆ తర్వాత అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపితే… నిలుస్తుందో, లేదో తెలియని అమరావతికి నిధులెలా ఇస్తారంటూ ఆ సంస్థకు ఫిర్యాదులు చేశారు. ప్రపంచ బ్యాంకు వెనక్కు వెళ్లేలా చేశారు. ఇది జరిగింది 2018లో. అప్పటి నుంచి జగన్ అమరావతి చుట్టూ బిగిస్తున్న బంధనాలను తెంచుకుని దాదాపుగా ఆరేళ్లకు గానీ అమరావతి ప్రపంచ బ్యాంకు నిధులను అందుకోలేకపోయింది. వరల్డ్ బ్యాంకు నిధులు బుధవారం అమరావతి పద్దు కింద రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో చేరిపోయాయి.

అమరావతి నిర్మాణానికి కంకణబద్దులై సాగుతున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఏపీకి రెండో దఫా సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టినంతనే.. అమరావతికి నిధులు రాబట్టే పనిని ప్రారంభించారు. కేంద్రం వద్ద తనకున్న పరపతిని ఆయన ప్రయోగించారు. ఈ క్రమంలో వరల్డ్ బ్యాంకు రుణానికి గ్యారెంటీ ఇచ్చేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు అంగీకరించింది. ఇంకేముంది… వరల్డ్ బ్యాంకు తనతో పాటు ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ప్రతినిధులను వెంటేసుకుని అమరావతిలో పర్యటించింది. ఈ పర్యటన తర్వాత అమరావతి నిర్మాణానికి రూ.13 వేల కోట్ల మేర రుణాన్ని ఇచ్చేందుకు తాము సిద్ధమేనని తెలిపింది. అందులో సగాన్ని తాను, మిగిలిన సగాన్ని ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు ఇస్తుందని తెలిపింది. ఈ దశగా దశలవారీగా ఉన్న అనుమతుల ప్రక్రియను పూర్తి చేసింది.

ఇప్పటికే ఆ అనుమతుల జారీ ప్రక్రియ ముగిసిపోగా… తొలి విడత రుణ నిధుల విడుదల కింద బుధవారం రూ.3,535 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాకు ప్రపంచ బ్యాంకు విడుదల చేసింది. ఈ పరిణామాన్ని అమరావతి నిర్మాణంలో కీలక అడుగుగానే పరిగణించాలి. ఎందుకంటే… అమరావతి నిరోధకుడిగా పరిణమించిన జగన్ సృష్టించిన ప్రతిబంధకాలను దాటుకుని మరీ అంతర్జాతీయ సంస్థల నుంచి నిధులు రావడానికి దీనిని తొలి మెట్టుగానే పరిగణిస్తున్నారు. ఇకపై ఏ అంతర్జాతీయ సంస్థ అమరావతికి వచ్చినా… తొలుత వరల్డ్ బ్యాంకు రాజధానికి నిధులు ఇచ్చిన విషయాన్ని పరిగణనలోకి తీసుకునే నిధుల విడుదలకు అక్కడికక్కడే సిద్ధపడే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి. వరల్డ్ బ్యాంకు తన తొలి విడత నిధులను విడుదల చేయగా… త్వరలోనే ఏసియన్ డెవలప్ మెంట్ బ్యాంకు నుంచి కూడా తొలి విడత రుణ నిధులు విడుదల కానున్నాయి. వెరసి అమరావతికి ఇక నిధుల కొరత అన్నది రాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.